Shilpa Shirodkar: అక్కలు హీరోయిన్లుగా ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత తమ చెల్లెళ్లను కూడా హీరోయిన్లుగా పరిచయం చేస్తారు. కానీ అక్కలు సక్సెస్ అయినంతగా చెల్లెళ్లు సక్సెస్ అవ్వలేదు. అలా ఇద్దరూ సమానంగా సక్సెస్ అయిన సందర్భాలు చాలా అరుదు. శిరోద్కర్ సిస్టర్స్ విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా మోడల్ నుండి హీరోయిన్‌గా మారి తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టింది నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar). తన తర్వాత హీరోయిన్‌గా తన చెల్లెలు శిల్పా కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. వెంటవెంటనే ఆఫర్లు వచ్చినా కూడా శిల్పా శిరోద్కర్‌కు మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ లభించలేదు. దానికి కారణం తాజాగా బయటపెట్టింది.
మళ్లీ లైమ్‌లైట్‌లోకి
బాలీవుడ్‌లో శిల్పా శిరోద్కర్‌కు పలు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కాయి. కానీ అవన్నీ ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. దిలీప్ కుమార్‌తో ‘కలింగ’, అజయ్ దేవగన్‌తో ‘సింగర్’, కమల్ హాసన్‌తో ‘లేడీస్ ఓన్లీ’.. లాంటి సినిమాలు తనకు తెలియకుండానే తన చేయి జారిపోయాయి. ఒకవేళ ఆ సినిమాలు అన్నింటిలో తను యాక్ట్ చేసుంటే అప్పట్లో శిల్పాకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కేది. అసలు ఆ సినిమా అవకాశాలకు ఏమైంది, ఎందుకు చేజారిపోయాయి అనే విషయాలు తాజాగా బయటపెట్టింది శిల్పా శిరోద్కర్. ఇటీవల పూర్తయిన బిగ్ బాస్ సీజన్ 18లో కంటెస్టెంట్‌గా కనిపించిన శిల్పా.. హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు చేస్తూ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
హ్యాపీగా ఫీలవుతాను
దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘కలింగ’ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యిందని, దానికోసం తాను కూడా షూటింగ్‌లో పాల్గొన్నానని గుర్తుచేసుకుంది శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపింది. ముంబాయ్, జోధ్‌పూర్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందని తనకు ఇంకా గుర్తుందని చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తే ప్రేక్షకులంతా తనను దిలీప్ కుమార్ దర్శకత్వంలో చూస్తున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీలవుతానని తెలిపింది శిల్పా శిరోద్కర్. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన ‘సింగర్’ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యిందని బయటపెట్టింది.
Also Read: సన్యాసినిగా మారిన మరొక స్టార్ సెలబ్రిటీ.. కుంభమేళలో రెండో హీరోయిన్
పూర్తి కాలేదు
‘‘సింగర్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ షిమ్లాలో షూట్ చేశాం. ఇలా చాలా సినిమాల షూటింగ్‌లో నేను పాల్గొన్నానని కూడా దాదాపుగా మర్చిపోయాను. ‘సింగర్’ మూవీ దాదాపు 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నా.. అది అసలు ఎందుకు పూర్తవ్వలేదో నాకు కూడా తెలియదు. కమల్ హాసన్‌తో లేడీస్ ఓన్లీ కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అది ఒక కామెడీ సినిమా. దానికోసం సీమా బిస్వాస్, హీరా, రణధీర్ కపూర్‌తో కలిసి చెన్నైలో షూటింగ్ చేశాను. ఇందులో కమల్ హాసన్ హీరో కాదు కానీ గెస్ట్ రోల్ చేశారు. కానీ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. విడుదల కాలేదు’’ అంటూ తన ఆగిపోయిన సినిమాల గురించి అందరితో షేర్ చేసుకుంది శిల్పా శిరోద్కర్.