Mahesh Babu: రోజురోజుకు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. అంతకుముందులా ఇలాంటి పాత్రలే చేయాలనీ హీరోలు, లేదు గ్లామర్ పాత్రలే చేయాలనీ హీరోయిన్లు గిరి గీసుకొని కూర్చోవడం లేదు. ఇక ఇంకోపక్క టాలీవుడ్.. పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతోంది.
ప్రతి స్టార్ హీరో.. అంచలంచెలుగా ఎదగాలని చూస్తున్నారు. హిందీలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. ఇప్పటివరకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని ఏకైక హీరో మహేష్ బాబు మాత్రమే. అంతేకాదు.. ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా చేయని హీరో కూడా సూపర్ స్టార్ అనే చెప్పాలి. నాలుగేళ్ల వయస్సు నుంచే మహేష్.. తెరపై కనిపించడం మొదలుపెట్టాడు.
నీడ అనే సినిమాలో తండ్రితో పాటు రెండు సీన్స్ లో కనిపించాడు. అలా మొదలైన మహేష్ ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మహేష్ వయస్సు 49. ఆయన నటించిన సినిమాలు 28. ఇప్పటివరకు ఈ 28 సినిమాల్లో ఏ ఒక్కటి రీమేక్ కాదు. ఎప్పుడు రీమేక్ చేయాలని కూడా మహేష్ ఆలోచించలేదు. సినిమానే ప్రాణంగా బతుకుతున్న మహేష్.. ఏరోజు బాలీవుడ్ లో అడుగుపెట్టాలని అనుకోలేదు.
ఎన్నోసార్లు బాలీవుడ్ మేకర్స్.. మహేష్ ను హిందీలో పరిచయం చేయడానికి మొగ్గు చూపినా మహేష్ సున్నితంగా తిరస్కరించాడు. భారీ పారితోషికం ఇస్తామన్నా.. అసలు సమస్యే లేదు.. నేను బాలీవుడ్ లో నటించను అని నిర్మొహమాటంగా చెప్పిన రోజులు కూడా ఉన్నాయట.
ఒక ఇంటర్వ్యూలో మహేష్.. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ” నేను హిందీలో సినిమాలు చేయను. నాకు తెలుగులో చేయడం బావుంది. బాలీవుడ్ నన్ను భరించలేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక అప్పట్లో ఈ వ్యాఖ్యలు సెన్సేషన్ సృష్టించాయి. ఇక తనంతట తాను బాలీవుడ్ లోకి అడుగుపెట్టకపోయినా.. ssmb29 ద్వారా హిందీలోకి కూడా మహేష్ అడుగుపెట్టనున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసమైనా మహేష్ బాలీవుడ్ లో అడుగుపెడతాడేమో చూడాలి.