Mahesh Babu – Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తో సినిమా అంటే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎగిరి గంతేస్తాడు. ఇప్పటిదాకా టాలీవుడ్ లేదా పాన్ ఇండియా డైరెక్టర్ అంటే రాజమౌళి అనే పేరు వినిపించేది. కానీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఆయనకు పోటీగా దిగారు సుకుమార్. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో దునియాను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లెక్కల మాస్టారు. అయితే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా… ఎప్పుడో ఒకసారి లెక్కలు తప్పుతాయి కదా. రాజమౌళి ఖాతాలో అయితే ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. కానీ సుకుమార్ విషయంలో మాత్రం అలా కాదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఆయన లెక్కలు తప్పాయి.
ఆర్య మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత జగడం, ఆర్య-2, 100 % లవ్ వంటి సినిమాలతో దూసుకెళ్లారు. ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో ‘1 నేనొక్కడినే’ (1 Nenokkadine) అనే సినిమా ఛాన్స్ వచ్చింది. నిజానికి ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా. అయినప్పటికీ అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో ఈ సినిమా రిజల్ట్ పట్ల అసంతృప్తిగా ఉన్న మహేష్ బాబు ఆయనతో నెక్స్ట్ మూవీనీ రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా డైరెక్ట్ గా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా… క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్ తో తన నెక్స్ట్ ఫిలిం రూపొందట్లేదని, ఆయన నెక్స్ట్ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని తన పోస్టులో రాసుకొచ్చారు.
అంతేకాకుండా ఆయన టాలెంట్ కి ఎప్పటికీ రెస్పెక్ట్ ఇస్తానని, 1 నేనొక్కడినే మూవీ ఎప్పటికీ కల్ట్ క్లాసిక్ గా ఉంటుందని, ఈ మూవీ తీసినప్పుడు ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశానని రాసుకొచ్చారు. అయితే ‘1 నేనొక్కడినే’ మూవీ అనుకున్న విధంగా ఆడక పోవడం వల్లే సుకుమార్ ని మహేష్ బాబు పక్కన పెట్టాడని టాక్ నడిచింది. అయితే ఆ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ సుకుమార్ నెక్స్ట్ తీసిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
‘1 నేనొక్కడినే’ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చేసిన ‘నాన్నకు ప్రేమతో’ ఇప్పటికీ యంగ్ టైగర్ అభిమానుల ఫేవరెట్ సినిమాల లిస్టులో ఉంటుంది. ఇక ‘రంగస్థలం’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడేమో ‘పుష్ప’ ప్రభంజనం నడుస్తోంది. ఏ రకంగా చూసుకున్నా కూడా అప్పట్లో సుకుమార్ ని రిజెక్ట్ చేసి మహేష్ బాబు తప్పు చేశాడా ? అనే ఫీలింగ్ కలగక మానదు. ఒకవేళ అప్పట్లోనే సుకుమార్ తో మహేష్ సినిమాను ఒప్పుకొని ఉంటే ఒక రంగస్థలం, లేదా ఓ పుష్ప సినిమాతో ఇప్పటికే సూపర్ స్టార్ పాన్ ఇండియా స్థాయిలో ఉండే వారేమో అనుకుంటున్నారు మూవీ లవర్స్. ఏదేమైనా అంతా మనమంచికే అన్నట్టుగా సుకుమార్ దర్శకత్వంలో చివరగా నటించిన ముగ్గురు హీరోలు కూడా ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోలు కావడం విశేషం. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్… ఈ ముగ్గురూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా అదరగొడుతున్నారు. ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా మహేష్ ఈపాటికే పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు. ఇప్పుడు ‘పుష్ప 2’ రిలీజ్ నేపథ్యంలో మహేష్ లెక్క తప్పిందిగా అంటూ ఆయన గతంలో చేసిన పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.