Pushpa 2 Making Video: ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా పుష్పగాడి గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ గురించే సోషల్ మీడియా అంతా మోత మోగిపోతోంది. మూడేళ్లు ఈ సీక్వెల్ కోసం బన్నీ ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు. మొత్తానికి ఇప్పుడు ‘పుష్ప 2’ను థియేటర్లలో చూసే అవకాశం వారికి లభించింది. దీంతో అసలు అల్లు అర్జున్ మాత్రమే కాదు.. తన ఫ్యాన్స్ కూడా ఎక్కడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు. ఎలాగైనా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకునే వారికంటే హిట్ అయ్యింది అని ఫిక్స్ అయిన వారే ఎక్కువమంది ఉన్నారు. ఇదే సమయంలో ‘పుష్ప 2’ మేకింగ్ వీడియో బయటికొచ్చి హల్‌చల్ చేస్తుంది.
సుకుమార్ కష్టం
‘పుష్ప 2’ను తెరకెక్కించడం కోసం మూడేళ్ల పాటు మూవీ టీమ్ అంతా చాలా కష్టపడిందని చెప్తున్నారు. అయితే ఆ కష్టం ఎలా ఉంటుందో చూపించడం కోసం ఒక మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోలో చాలావరకు సుకుమార్ కష్టమే కనిపిస్తోంది. తనకు యాక్టర్ల నుండి ఏం కావాలో ముందుగా తాను చేసి చూపించడం, తను అనుకున్నట్టుగా సీన్ రాకపోతే మళ్లీ మళ్లీ దానికోసం కష్టపడడం ఇవన్నీ ఆ మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మామూలుగా సుకుమార్ అంటేనే పర్ఫెక్షనిస్ట్ అని, తనకు అన్ని కరెక్ట్‌గా ఉండాలని చాలామంది అంటుంటారు. ఈ మేకింగ్ వీడియో చూస్తే ఆ మాటలు నిజమే అని క్లారిటీ వస్తుంది.
నేచురల్ లొకేషన్స్
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా షూటింగ్ చాలావరకు అడవుల్లోనే జరిగింది. దానికోసం ఎన్నో కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను కూడా జతచేశారు. కానీ చాలావరకు లొకేషన్స్ నేచురల్‌గా ఉండేలాగా సుకుమార్ చూసుకున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్‌పై తెరకెక్కే సినిమా కావడంతో ఆ అడవుల్లో లారీల్లో గంధపు చెక్కలను తరలించే సీన్స్ నేచురల్‌గా వచ్చేలా కష్టపడ్డారు. మొత్తానికి ఈ మేకింగ్ వీడియో కూడా ‘పుష్ప 2’పై అంచనాలు పెంచడానికి తోడ్పడుతోంది. ఇప్పటికే చాలావరకు థియేటర్లలో ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
మెగా ఫ్యాన్స్ నెగిటివిటీ
‘పుష్ప 2’పై పాజిటివిటీ ఎంతుందో దానిపై నెగిటివ్ కామెంట్స్ కూడా అంతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాకు వ్యతిరేకంగా ఉన్నారు. అంతే కాకుండా ఈ మూవీకి ఇంతలా హైప్ వస్తున్నా కూడా ఒక్క మెగా హీరో కూడా దీని గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే మెగా హీరోలకు, అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెగా హీరోలు కూడా ఈ సినిమాకు సపోర్ట్‌గా మాట్లాడకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ మూవీని వెలివేస్తున్నారు. పైగా పెరిగిన టికెట్ ధరలు కూడా ‘పుష్ప 2’ థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.