Manchu Family Issue :ఒక్కక్షణం ఆవేశం అగ్ని జ్వాలలు రగిలిస్తోంది.. ముఖ్యంగా మోహన్ బాబు (Mohan Babu) జల్పల్లి నివాసంలో జరిగిన ఉద్రిక్తత అందరిలో అసహనం కోల్పోయేలా చేస్తోందని చెప్పవచ్చు. కుటుంబ వివాదం రోడ్డుపైకి రావడమే సరికొత్త అనుమానాలకు దారితీసింది. వాస్తవానికి అన్నదమ్ముల మధ్య ఆస్థి గొడవలు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా మంచు మనోజ్ (Manchu Manoj) తండ్రితో గొడవ పెట్టుకోవడం అత్యంత దారుణమైన పరిస్థితికి దారితీసింది. మరొకవైపు తన కుటుంబ సభ్యులే తనను దూరం పెట్టారనే ఆరోపణలు చేస్తున్నారు మంచు మనోజ్.
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి..
ఇకపోతే నిన్న మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన సంఘర్షణలో మోహన్ బాబు జర్నలిస్టులపై రౌడీయిజం చలాయిస్తూ.. అత్యంత దారుణంగా వారి బుర్రలు పగలగొట్టారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు గొడవలో గాయపడిన జర్నలిస్టుకు ముక్కు నుంచి చెవికి అనుసంధానమైన ఎముక మూడు చోట్ల ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో మోహన్ బాబు పై పూర్తిస్థాయిలో వ్యతిరేకత నెలకొంది.
మా సభ్యత్వం తొలగించాలని డిమాండ్..
మోహన్ బాబు నుంచి తమకు ప్రాణహాని ఉందని గాయపడ్డ జర్నలిస్టులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా మోహన్ బాబు పై సెక్షన్ 118 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే పెద్ద ఎత్తున జర్నలిస్టు సంఘాలు ఏకమై మోహన్ బాబు, మంచు విష్ణు పై మండిపడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం నుంచి మంచు మోహన్ బాబును వెంటనే తొలగించాలని అలాగే మంచు విష్ణు ని కూడా అధ్యక్ష పదవి నుంచి తొలగించి, మా సభ్యత్వం లేకుండా చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి అని, ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ తెలియజేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి జర్నలిస్టుల డిమాండ్లు సరైనవే కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే దానిపైన ఆధారపడి ఉంది.
జర్నలిస్టులపై దాడి.. కన్నప్ప రిజల్ట్ పై ఎఫెక్ట్..
మోహన్ బాబు విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తన అద్భుతమైన చిత్రాలతో కలెక్షన్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈయన , ఇప్పుడు ప్రెస్టేజియస్ మూవీగా ‘కన్నప్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు వారి కెరియర్ పైన, సినిమా రిజల్ట్ పైన దెబ్బ పడేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంట్లో చూసుకోవాల్సిన గొడవలు బజారుకొస్తే ఇలాగే ఉంటుందని కొంతమంది నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి జర్నలిస్టుల డిమాండ్లు ఏ మేరకు నెరవేరుతాయి చూడాలి. మొత్తానికి అయితే వీరి దాడిలో గాయపడ్డ జర్నలిస్టులు మాత్రం మోహన్ బాబు కారణంగా ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.