Manchu Manoj: మంచు మనోజ్(Manchu Manoj) దాదాపు 9 సంవత్సరాల తర్వాత వెండితెరపై సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. తన వ్యక్తిగత కారణాలవల్ల మనోజ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా 9 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ భైరవం (Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. అయితే మనోజ్ తన సినిమాల కంటే కూడా కుటుంబంలో చోటుచేసుకున్న గొడవలు కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా తన అన్నయ్య విష్ణు తో పాటు తన తండ్రి మోహన్ బాబుతో తనకు గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఆస్తుల కోసం కాదు..
ఇలా ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య జరిగిన వివాదాలు ఒక్కసారిగా బయటపడటంతో ఈ అన్నదమ్ములు రోడ్లపైనే కొట్టుకోవడం, ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం వంటివి జరిగాయి. అయితే ఈ గొడవ గురించి విష్ణు(Vishnu) మోహన్ బాబు ఎక్కడ క్లారిటీ ఇవ్వకపోయినా మనోజ్ మాత్రం పలు సందర్భాలలో అసలు గొడవకు కారణం ఏంటి అనే విషయాలను తెలియచేస్తూ వచ్చారు. తాను ఆస్తుల కోసం గొడవ పడలేదని, యూనివర్సిటీ కోసమే గొడవ పడుతున్నానని ఈయన క్లారిటీ ఇచ్చారు.
స్పందించని సినీ పెద్దలు..
మంచు కుటుంబం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న కుటుంబం. అయితే ఈ కుటుంబంలో ఇలాంటి గొడవలు చోటు చేసుకోవడంతో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా ఈ వ్యవహారంపై స్పందించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కు ఇదే ప్రశ్న ఎదురవడంతో ఆయన ఆసక్తికరమైన సమాధానాలను చెప్పారు. ఈ విధంగా గొడవ చోటు చేసుకున్న సమయంలో ఇండస్ట్రీలో ఎంతోమంది తనకు ఫోన్ చేసి మాట్లాడారు కానీ, ఈ గొడవ గురించి కూర్చోబెట్టి మాట్లాడటానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు.
దాసరి నారాయణరావు గారు..
ఇక ఇండస్ట్రీలో నాన్నకు సలహాలు ఇచ్చి, ఈ గొడవ గురించి మాట్లాడే అంత పెద్ద వాళ్ళు ఎవరూ లేరని మనోజ్ తెలిపారు. ఒకవేళ గురువుగారు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) గారు బ్రతికి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదని మనోజ్ దాసరి గారిని గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావు ,మోహన్ బాబు(Mohan Babu) మధ్య బాండింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దాసరి గారిని గురువుగా భావిస్తూ ఆయన మాట జవదాటకుండా మోహన్ బాబు ఉండేవారు. అయితే దాసరి గారు ఉంటే ఈరోజు మా కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉండేవి కాదని ఆయన నాన్నను మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించేవారు అంటూ మనోజ్ దాసరి నారాయణరావు గారిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడంతో ఇండస్ట్రీలో నాన్నకు చెప్పే పెద్దవాళ్ళు ఎవరు లేరని, సమయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అంటూ ఈ సందర్భంగా మరోసారి తన గొడవలపై స్పందిస్తూ మనోజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: OG Ceeded Rights : వీరమల్లు కాలేదు.. ఓజీకి ఫుల్ డిమాండ్.. సీడెడ్ రైట్స్ సోల్డ్ అవుట్