Manchu Manoj : మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పట్లో చల్లబడేలా కనిపించట్లేదు. మధ్యలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ గొడవతో మంచు ఫ్యామిలీ గొడవలు సైలెంట్ అయ్యాయేమో అనుకున్నారంతా. కానీ అంతలోపే మరోసారి మంచు మనోజ్ (Manchu Manoj) శనివారం తన కుటుంబంలో జరిగిన గొడవ గురించి బయట పెట్టారు. అంతేకాకుండా జనరేటర్ లో పంచదార పోసి తనను చంపాలనుకున్నారంటూ ఆరోపించారు.
తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) మాట్లాడుతూ “నేను నిన్న షూటింగ్లో బిజీగా ఉన్నాను. నా భార్య స్కూల్లో మా కొడుకు ఈవెంట్ కి హాజరైంది. అదే టైంలో అమ్మ బర్త్ డే కేకు నేపంతో నా బ్రదర్ విష్ణు… అతని అనుచరులు కిరణ్, విజయ్ రెడ్డి, రాజ్ కొండూరులతో పాటు మరికొందరితో నా ఇంటికి వచ్చాడు. జనరేటర్లలో పంచదార పోయించడంతో మేమంతా రాత్రి ఇబ్బంది పడ్డాం. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాము. ఇంట్లో 9 నెలల కుమార్తె, నా కొడుకు, మా అమ్మ, నా అత్తమామలు కూడా ఉన్నారు. జనరేటర్ లో షుగర్ వేస్తే అగ్ని ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా జనరేటర్ల దగ్గర వాహనాలు, గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది. విష్ణు టీం ఇంట్లో నుంచి వెళ్తూ ఇంటి దగ్గర పని చేసే వాళ్లను అక్కడి నుంచి పంపించేశారు. అలాగే నా దంగల్ కోచ్ కు వార్నింగ్ ఇచ్చారు. అమ్మ పుట్టినరోజు నాడు ఇలా జరగడం కలచివేసింది. నేను నా కుటుంబం భయం భయంగా బతుకుతున్నాము. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము “అంటూ మంచు మనోజ్ వెల్లడించారు.
అయితే మోహన్ బాబు భార్య బర్త్ డే పార్టీ జరుగుతుండగా, అక్కడ కరెంట్ పోయినట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో జనరేటర్ లను ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదట. సమస్య ఏంటో చీకట్లో స్పష్టంగా కనిపించకపోవడంతో ఆదివారం ఉదయాన్నే చూడగా, జనరేటర్ లో తన అన్న మంచు విష్ణు పంచదార పోయించినట్లు గుర్తించామంటూ మనోజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన పహడి షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను కరెంట్ ఫిక్షన్ చేసి చంపాలని కుట్ర చేశారని ఆ కంప్లైంట్ లో మనోజ్ పేర్కొన్నాడు. దీంతో వీరి వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.
రీసెంట్ గా మంచు మనోజ్ (Manchu Manoj), మోహన్ బాబు మధ్య మనస్పర్ధల కారణంగా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆ వివాదంలో భాగంగా జల్పల్లి లో ఆయన నివాసం వద్ద మోహన్ బాబు ఆగ్రహంతో మీడియా ప్రతినిధి పై దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో మంచు మోహన్ బాబు దిగి వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు పోలీసులు ఇటు మంచు విష్ణు, మనోజ్ లతో ఫ్యామిలీ గొడవలతో రోడ్డుకి ఎక్కువద్దంటూ బాండ్ కూడా రాయించుకున్నారు. అంతలోనే మనోజ్ మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది.