Korea Defence Minister Suicide| దక్షిణ కొరియా మాజీ రక్షణ శాఖ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. కొరియాలో సైనిక పాలన నిర్ణయాన్ని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఉపసంహరించుకున్నా.. ఇంకా ఆ వివాదం ముదురుతూనే ఉంది. సైనిక పాలనకు అధ్యక్షుడు ఆదేశించగానే రక్షణ మంత్రి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, రక్షణ శాఖ మంత్రిపై విచారణ ప్రారంభమైంది. వారం రోజుల క్రితం గురువారం డిసెంబర్ 5, 2024న రక్షణ శాఖ మంత్రి పదవికి కిమ్ యోంగ్ హ్యూన్ రాజీనామా చేశారు.
గత ఆదివారం నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం ఆయనను అధికారికంగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టుకు కొన్ని నిమిషాల ముందే కిమ్ యోంగ్ హ్యూన్ ఆత్మ హత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని కొరియా పార్లమెంటులో కమిషనర్ జెనెరల్ ఆఫ్ కొరియా కరెక్షనల్ సర్వీస్ తెలిపారు. తననను అరెస్టు చేయబోతున్నారని తెలియగానే ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారని చెప్పారు.
“మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ సియోల్ డోంగ్బు డిటెన్షన్ సెంటర్ లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. మంగళవారం అర్ధరాత్రి ఆయనను అధికారికంగా అరెస్టు చేయబోతున్నారనే భయంతో ఆత్మహత్య చేసుకోబోయారు.” అని కొరియా మీడియా సంస్థ షిన్ యోంగ్ హేలో అధికారికంగా కథనం ప్రచురితమైంది.
Also Read: యుద్ధంలో పసికందుల ఏడ్పులు, మహిళల ఆర్తనాదాలు.. అంతా ఫేక్.. ఇజ్రాయెల్ టెక్నిక్ ఇదే..
మీడియా కథనం ప్రకారం.. మాజీ రక్షణ మంత్రి డిటెన్షన్ సెంటర్ లోని టాయిలెట్ కు వెళ్లి అక్కడ తన బట్టలు ఉపయోగించి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించారు.
కొరియాలో సైనిక పాలన విధించే ప్రయత్నించారన్న ఆరోపణలపై ఒకవైపు అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ విచారణను ఎదుర్కొంటున్నారు. సైనిక పాలన విధించేందుకు పన్నిన కుట్రలో రక్షణ మంత్రి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయన తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి.
అరెస్టుకు ముందు తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను మాజీ రక్షణ శాఖ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ నాశనం చేసేందుకు ప్రయత్నించారనే సీరియస్ ఆరోపణలున్నాయని.. ఆయనను కఠినంగా విచారణ చేస్తామని కొరియా కోర్టు ప్రతినిధి బుధవారం తెలిపారు.
దక్షిణ కొరియాలో సైనిక పాలన
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ కొన్ని రోజుల క్రితం దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతిపక్షాలను, సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేసేందుకు ఆయన సైనిక పాలన విధించారనే ఆరోపణలున్నాయి. కానీ ఈ ప్రకటన వెలెవడిన కొన్ని గంటల్లోనే పార్లెమెంటు అన్ని పక్షాలు కలిసి సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయగా.. స్పీకర్ దాన్ని ఆమోదించారు. దీంతో కొరియాలో సైనిక పాలన ప్రకటించిన కొన్ని గంటల తరువతనే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఆ తరువాత అధ్యక్షుడిపై అభిశంసన ఓటు వేసి తొలగించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా.. అధికార పార్టీ రెబెల్స్ అభిశంసన చేయకుండా వెనుకడుగు వేశారు. చివరికి తన పదవి కాపాడుకోవడానికి అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా విచారణ కూడా సాగుతోంది. ప్రెసిడెంట్ ఆఫీసులో దక్షిణ కొరియా పోలీసులు తనిఖీలు కూడా చేయడం విశేషం.