Manisha Koirala:ప్రముఖ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా (Manisha Koirala).. తన అందచందాలతో, అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకొని, తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా మెప్పించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో సీనియర్ సెలబ్రిటీలకు ఇచ్చే అవకాశాల గురించి చెప్పి అందరిని అబ్బురపరిచింది. వయసు అనేది ఇండస్ట్రీలో కేవలం ఒక నంబర్ మాత్రమే అని, ఇండస్ట్రీలో సమస్య కాదు అంటూ తెలిపింది. ముఖ్యంగా సీనియర్ నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవించి ఉన్నంతకాలం సంతృప్తిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలోనే క్యాన్సర్ తో పోరాడి , తిరిగి ధైర్యంగా ఆరోగ్యంగా మళ్ళీ మన ముందుకు వచ్చిన మనీషా, ఇప్పుడు సీనియర్ నటీమణులకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించాలని, కీలక పాత్రలు ఇవ్వాలి అని తెలిపింది.
సీనియర్ హీరోయిన్స్ కి ఇచ్చే అవకాశాలపై మనీషా ఊహించని కామెంట్స్..
మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. “వృద్ధాప్యం అనేది సినిమా పరిశ్రమలో ఒక సమస్య కాదు. కానీ ఇది పరిష్కరించాల్సిన సమస్య మాత్రమే. ఇండస్ట్రీలో సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు కల్పించాలి. ఎందుకంటే హీరోల వయసు గురించి ఎవరు కూడా కామెంట్లు చేసినట్లు ఇప్పటివరకు నేను వినలేదు. ఈ విషయంలో ఎందుకో మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తారు. ముఖ్యంగా సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఆమెకు తల్లి, సోదరి పాత్ర ఇద్దామని అంటారు కానీ మహిళలు ఎలాంటి పాత్రలు అయినా చేయగలరు కదా.. యాక్షన్ పాత్రలను వారికి ఇవ్వచ్చు కదా అని మాత్రం ఆలోచించరు. నిజానికి మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. గతంలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు దీనిని నిరూపించారు కూడా.. నేను కూడా ఎలాంటి పాత్రనైనా సవాల్ గా తీసుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికీ ఇంకా కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నాను. ఆర్టిస్ట్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా మనం ఒక అద్భుతమైన జీవితాన్ని గడపగలం. అందుకే ఏజ్ అనేది సమస్య కాదని, ఈ ప్రపంచానికి మనల్ని మనం చూపించుకోవాలి. రానున్న తరాలకు మార్గదర్శి కావాలి.. నేను జీవించినంత వరకు కూడా ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు అదే ఆశయంతో జీవిస్తున్నాను” కూడా అంటూ మనీషా కొయిరాలా తెలిపింది. మొత్తానికైతే తనకు ఎలాంటి సాహసోపేతమైన పాత్రలు ఇచ్చినా చేస్తానని డైరెక్టర్లకు హింట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.
మనీషా కొయిరాలా కెరియర్..
1991లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, ఆ తర్వాత ‘బొంబాయి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వెల్లడించిన ఈమె.. 2014లో తిరిగి దాని నుంచి కోలుకుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడడంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చింది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరామండీ’ అనే వెబ్ సిరీస్ లో మల్లికాజాన్ అనే పాత్రలో నటించి, తన నటనతో ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తాను మళ్ళీ నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. కాబట్టి ఇలా కామెంట్లు చేసింది మరి ఇప్పటికైనా ఈమెకు ఎవరైనా అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి.