Urmila Kothare : ప్రముఖ మరాఠీ నటి ఊర్మిళ కనేత్కర్ (Urmila Kothare) కారు అతివేగం వల్ల యాక్సిడెంట్ కు గురి కాగా, ఒక లేబర్ ప్రాణాన్ని బలి తీసుకుంది. కారు లేబర్లపైకి దూసుకెళ్లగా, ఈ ఘోర ప్రమాదంలో ఒక మెట్రో ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని కండివాలిస్ పాయింసర్ మెట్రో స్టేషన్ సమీపంలో డిసెంబర్ 27న శుక్రవారం అర్థరాత్రి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మరాఠీ నటి ఊర్మిళ కనేత్కర్ (Urmila Kothare) అలియాస్ ఊర్మిళ కొఠారి డిసెంబర్ 27 సాయంత్రం షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఆ టైమ్ లో ఆమె కారులో నిద్రపోగా, డ్రైవర్ కారును డ్రైవ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే సడన్ గా కారు అదుపు తప్పి, మెట్రో నిర్మాణ స్థలంలో పని చేస్తున్న ఇద్దరు కూలీలను ఢీ కొట్టింది. గాయపడిన వారిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో కారు లోపల ఉన్న ఊర్మిళా కనేత్కర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కారణంగా ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఊర్మిళాతో పాటే ఆమె డ్రైవర్ కు కూడా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పెను ప్రమాదం కారణంగా కారు బాగా డ్యామేజ్ అయ్యింది. ఇక డ్రైవర్‌పై సమతా నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
నటి ఊర్మిళా (Urmila Kothare) తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఊహించని ఘటన ఇద్దరు కూలీల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఊర్మిళ, ఆమె డ్రైవర్ ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఊర్మిళ త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. అలాగే మెట్రో కార్మికుడి విషాద మరణంపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఘటనపై ఊర్మిళ భర్త ఇంకా మాట్లాడలేదు. ఈ ఘటనలో బాధితులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అన్నది చూడాలి.
మరాఠీ సినిమాలో ఊర్మిళా (Urmila Kothare) పాపులర్ నటి. దునియాదారి, శుభమంగళ్ సావధాన్, మాలా ఆయ్ వ్హయ్చి, తి సధ్యా కే కార్తే వంటి సినిమాలలో ఆమె నటించింది. అలాగ అసంభవ్, ఉన్ పాస్, గోష్టా ఏక లగ్నాచితో సహా పలు సీరియల్స్‌లో తన పాత్రలతో ఎంతోమంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవల ‘తుజెచ్ మి గీత్ గాత్ అహే’ అనే షోతో బుల్లి తెరపై రీఎంట్రీ ఇచ్చింది. పెళ్లి తరువాత టెలివిజన్ కు దూరమైన ఊర్మిళా దాదాపు 12 సంవత్సరాల బ్రేక్ తర్వాత బుల్లి తెరపైకి తిరిగి వచ్చింది. ఆమె ప్రముఖ సినీ నిర్మాత మహేష్ కొఠారే కుమారుడు, నటుడు-చిత్రనిర్మాత అద్దినాథ్ కొఠారేని వివాహం చేసుకుంది. ఈ జంటకు జిజా కొఠారే అనే 6 ఏళ్ల కుమార్తె ఉంది.