Unni Mukundan : ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇటీవల ‘మార్కో’ (Marco) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఏ సర్టిఫికెట్ తో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కానీ నిజానికి ఉన్ని ముకుందన్ (Unni Mukundan) తన సినిమాలను ఫ్యామిలీ సమేతంగా ప్రేక్షకులు కంఫర్ట్ గా చూడడానికే ఇష్టపడతానని తాజాగా వెల్లడించారు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలు ఒత్తిడి చేసినప్పటికీ తాను మాత్రం నో కిస్సింగ్ పాలసీని ఫాలో అవుతానని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
నో కిస్సింగ్ పాలసీపై ఉన్ని ముకుందన్
ఈ శుక్రవారం విడుదల అయిన ‘గెట్ సెట్ బేబీ’ (Get Set Baby)లో ఏడు సంవత్సరాల తర్వాత తాను రొమాంటిక్ హీరోగా నటించడం గురించి ఉన్ని ముకుందన్ వ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ “నా సినిమాల్లో ముద్దులు పెట్టుకోకూడదు, సన్నిహితంగా ఉండకూడదు అనే నియమాన్ని నేను పాటిస్తాను. ఎందుకంటే నా సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులను ఆకర్షించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. చాలా సార్లు తెరపై రొమాంటిక్ సీన్స్ లో నటించమని చిత్ర నిర్మాతలు తనపై ఒత్తిడి తెచ్చారని, కానీ వాళ్ళ డిమాండ్ కి తను ఎప్పుడూ లొంగలేదని వెల్లడించారు. దీంతో చిత్ర నిర్మాతలు తెరపై రొమాంటిక్ గా నటించే ఇతర నటులను ఉదాహరణగా చూపించి, అలా యాక్ట్ చేయమని ఉన్నికి సలహా ఇచ్ఛవారట.
“ఆన్ స్క్రీన్ కపుల్ మధ్య సానిహిత్యాన్ని చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయని నేను అంటాను. రొమాన్స్ అంటే కేవలం ముద్దు మాత్రమే కానవసరం లేదు. యాక్షన్ షాట్లలో మనం ఎలాంటి విధానాన్ని అనుసరిస్తామో ఇది కూడా అలాంటిదే. ఓ వ్యక్తిని కొడుతున్నట్టుగా కనిపించినప్పటికీ, హీరో అతని ముఖాన్ని లేదా శరీరాన్ని ఎప్పుడూ తాకడు. ఈ పద్ధతిలోనే చాలామంది నటులు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేస్తారు. వాటికి నేను వ్యతిరేకం కాదు. కానీ నా సినిమాలన్నింటినీ కుటుంబ సమేతంగా ప్రేక్షకులు కలిసి చూసేలా ఉండాలని అనుకుంటాను. అందుకే ఇలా నో కిస్సింగ్ రూల్ పెట్టుకున్నాను” అని అన్నారు.
‘మార్కో’ తరువాత మరో మూవీతో…
కాగా ఉన్ని ముకుందన్ 2011లో తమిళ చిత్రం ‘సీడాన్’తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 2012లో రిలీజ్ అయిన ‘మల్లు సింగ్’ మూవీ ఆయనకి మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అతను డి కంపెనీ, జనతా గ్యారేజ్, భాగమతి వంటి మలయాళ, తెలుగు, తమిళ సినిమాలలో నటించాడు. 2024లో ఆయన నటించిన జై గణేష్, గరుడన్, మార్కో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘మార్కో’ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2025 జనవరి 1 న ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగానే భారీ వసూళ్లు రాబట్టింది. ‘మార్కో’ మూవీ తెలుగులో ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఉన్ని ముకుందన్ ‘గెట్ సెట్ బేబీ’తో థియేటర్లలో పలకరించారు. ఫిబ్రవరి 21 న ఈ మలయాళ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.