MM. Keeravani ..గత 25 సంవత్సరాలుగా ప్రేక్షకులను నిర్విరామంగా అలరిస్తున్న ఏకైక షో ‘పాడుతా తీయగా’.. దివంగత లెజెండ్రీ గాయకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం (SP Bala Subrahmanyam) ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆయన వారసుడు ఎస్పీ చరణ్ (SP Charan) కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) తనకు అన్యాయం జరిగిందని, పక్షపాతం చూపించారని, బాడీ షేమింగ్ చేశారు అని, క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పలు విషయాలు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై కొంతమంది సింగర్ ప్రవస్తి పై మండిపడ్డారు. ప్రస్తుతం ఆస్కార్ గ్రహీతలైన ఎంఎం కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandrabose ) తో పాటు సింగర్ సునీత (Singer Sunitha) ఈ కార్యక్రమానికి హాస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. వీరే తనకు అన్యాయం చేశారని ప్రవస్తి ఆరోపించడంతో పలువురు సింగర్స్ ఇంత గొప్ప వారిపై నిందలు వేయడం తప్పని ప్రవస్తిని తప్పుపట్టారు. ఇక వారు కూడా ఇలాంటి ఎన్నో అవమానాలు , ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వాళ్లే.. ఇలాంటి వారిపై నిందలు వేసేటప్పుడు కాస్త ఆలోచించు అంటూ ప్రవస్తీపై మండిపడ్డ విషయం తెలిసిందే.
ప్రవస్తి వర్సెస్ సునీత.. వైరల్ గా మారిన వీడియోలు..
ఇక ఇలా వార్తలు వైరల్ అవుతున్న వేళ.. ఈ విషయంపై సింగర్ సునీత స్పందించింది. “ప్రవస్తి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగా పాడే దానివి .అందుకే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు నీకు 19 సంవత్సరాలు.. ఇప్పుడు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేయలేము కదా.. చెబితే అన్ని విషయాలు చెప్పు” అంటూ ఆమెపై మండిపడింది. దీనికి రీకౌంటర్ గా ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. సునీత కూడా ఏమాత్రం తగ్గకుండా తన ఇన్స్టా రీల్ లో మరో కొటేషన్ షేర్ చేసింది. ఇలా రోజురోజుకీ వివాదం ముదురుతుంటే చంద్రబోస్, కీరవాణి మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ ఉన్నది నిజమే – కీరవాణి
ఈ నేపథ్యంలోనే ఆయన పాత వీడియోలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎం కీరవాణి క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారడం గమనార్హం. కీరవాణి మాట్లాడుతూ ..”అన్ని రంగాలలో లాగానే సినిమా ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుంది. ఇది సమాజంలో ఉన్న అతిపెద్ద వ్యాధి. ఇది అన్ని రంగాలలో కూడా ఉంది. అయితే కాస్టింగ్ కౌచ్ అనే ఆలోచన మైండ్ లోకి వచ్చినా కూడా అది తప్పే. మన సమాజంలో ఇలాంటి ఆలోచనలు రాని వారు ఎవరు ఉన్నారా అని వెతికితే కనీసం పదిమంది కూడా బయటికి రారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లుగానే ప్రవర్తిస్తారు. అయితే కొన్ని సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్స్ ని వేధించే సీన్లు పెట్టడం వల్ల ఇది నిజమే అని మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను లేదని చెప్పడం లేదు” అంటూ గతంలో ఎం ఎం కీరవాణి స్వయంగా చెప్పిన వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ కూడా ప్రవస్తి చెప్పింది నిజమే.. ఆమెకు నిజంగానే అన్యాయం జరిగింది అంటూ అందరూ ఒక నిర్ధారణకు వస్తున్నారు అని సమాచారం.