Mohan Babu Biopic: ఏ భాషలో అయినా బయోపిక్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అలనాటి సినీ సెలబ్రిటీల బయోపిక్స్ చూడడానికి ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తారు. అలా సినీ సెలబ్రిటీల జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే తెలుగులో మరికొందరు సెలబ్రిటీల జీవితకథలను సినిమాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో మోహన్ బాబు బయోపిక్ కూడా ఒకటి. ఇప్పటికే మోహన్ బాబు బయోపిక్ కచ్చితంగా తెరకెక్కుతుందని తన వారసుడు మంచు విష్ణు మాటిచ్చాడు. ఇక తాజాగా ఈ బయోపిక్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారసులతో కాదు
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి అప్పటి స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చిన నటుడు మోహన్ బాబు. ఆయన నటించిన సినిమాలు అన్నీ కమర్షియల్ సక్సెస్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించాయి కాబట్టే ఫ్యాన్స్ అంతా కలిసి ఆయనకు కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టుకున్నారు. దాదాపు 45 ఏళ్ల పాటు నటుడిగా ప్రేక్షకులను అలరించారు మోహన్ బాబు. ఆయన తర్వాత ఆయన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే త్వరలోనే ఇండస్ట్రీకి రావడానికి, వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కున్న కష్టాలను సినిమాలాగా వెండితెరపై కనిపించబోతోంది. ఈ విషయాన్ని తన కుమారుడు మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు. కానీ ఇందులో ఆయన వారసులు మాత్రం హీరోగా నటించడం లేదని తెలుస్తోంది.
కచ్చితంగా బయోపిక్ ఉంటుంది
ఇప్పటికే మంచు విష్ణు (Manchu Vishnu) నిర్మాతగా ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తానే నిర్మాత తన తండ్రి మోహన్ బాబు బయోపిక్‌ను నిర్మిస్తానని విష్ణు చాలాకాలం క్రితమే ప్రకటించాడు. ‘‘నా తండ్రి బయోపిక్ చేసే ఆలోచన ఉంది. అది త్వరలోనే నిజమవుతుంది కూడా. కానీ ఆయన పాత్రలో నేను కనిపించేంత సాహసం చేయలేను. మోహన్ బాబు పాత్రలో అద్భుతంగా నటించడానికి, ఆయన ఎదుర్కున్న కష్టాలను కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి, ఛాలెంజ్‌ల గురించి చెప్పడానికి ఒక హీరో ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. తాజాగా ఆ హీరో సూర్యనే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: ‘కన్నప్ప’పై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ట్రోలర్స్‌కి ఈ సారి..
తమిళ హీరోతో
మోహన్ బాబు బయోపిక్‌ను సూర్యతో తెరకెక్కించాలని మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాకుండా ఈ బయోపిక్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించడానికి కూడా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. తమిళ హీరో అయిన సూర్య (Suriya).. మోహన్ బాబు (Mohan Babu) బయోపిక్‌లో నటించడం అనేది వినడానికి కాస్త వింతంగా ఉన్నా నిజంగానే ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు. సూర్య కాకుండా మరే ఇతర తెలుగు హీరో అయినా కూడా మోహన్ బాబు పాత్రకు న్యాయం చేస్తారనే వారు ఫీలవుతున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాపైనే మంచు విష్ణు పూర్తి ఫోకస్ ఉండడంతో మోహన్ బాబు బయోపిక్ ఓకే అవ్వడానికి మరికాస్త సమయం పట్టక తప్పదు.