Mohan Babu Case :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు (Mohan Babu) కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ పై జరిపిన దాడిలో మోహన్ బాబు పై కేసు నమోదు అవ్వగా.. ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. అయితే హైకోర్టు.. మోహన్ బాబు మందస్తు బెయిల్ ను నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు.. ఈ మేరకు మోహన్ బాబు పిటిషన్ పై.. ప్రముఖ న్యాయవాదులైన జస్టిస్ సుధాన్షు ధులియా , జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ద్వి సభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్ట్..
ఇక విచారణ అనంతరం మోహన్ బాబుకు ఊరట కలిగించింది ధర్మాసనం. విచారణలో భాగంగా.. నాలుగు వారాలు విచారణను వాయిదా వేసింది. మూడు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది ధర్మాసనం. ఇక దీంతో మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో భారీ ఊరట కలిగిందని, అటు కుటుంబ సభ్యులు ఇటు అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే అరెస్టు నుండి తప్పించుకున్నారు అని చెప్పవచ్చు. కాగా, జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబు..
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ (Manchu Manoj), మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఇద్దరూ కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో పరస్పర కంప్లైంట్ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. ఆస్తి గొడవల వల్లే వీరిద్దరూ కంప్లైంట్ ఇచ్చుకున్నారనే వార్తలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇకపోతే జల్పల్లి లో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడంతో.. దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు(Manchu Vishnu)తన తరఫున 40 మంది బౌన్సర్లు తీసుకురాగా.. మంచు మనోజ్ కూడా 30 మంది బౌన్సర్లను తీసుకొచ్చారు. అయితే తాను తీసుకొచ్చిన బౌన్సర్లను లోపలికి అనుమతించలేదని మనోజ్ తన భార్య మౌనిక (Mounika) తో వెళ్ళి డీజీపీ , డిజీలను కలసి తనకు పోలీసులు, కుటుంబ సభ్యులు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత ఇంటికొస్తున్న సమయంలో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి గేటు వద్ద సెక్యూరిటీ.. వీరిని లోపలికి అనుమతించలేదు. దీంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబును మీడియా వారు ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు.. వారి దగ్గర ఉన్న టీవీ మైక్ తీసుకొని వారిపై దాడి చేశారు.. ఈ నేపథ్యంలోని ఆ జర్నలిస్టులు గాయపడ్డారు కూడా.. దీంతో వారి మోహన్ బాబుపై కేసు ఫైల్ చేయించారు.