Nidhi Agerwal : ఇటీవల కాలంలో సోషల్ మీడియా వల్ల హీరోయిన్లకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. మొహం కనిపించదు కదా అనే ధైర్యంతో చెప్పరాని విధంగా కామెంట్స్ చేస్తూ, నటీనటులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. తాజాగా స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal) కి ఇలాగే సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎదురు కాగా, ఆమె సైబర్ క్రైమ్ ను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal) తనను వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తన కంప్లైంట్ లో ఓ వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదనను వ్యక్తం చేసింది. తనను మాత్రమే కాకుండా తనకు కావలసిన వాళ్ళని కూడా అతను బెదిరిస్తున్నాడనీ, ఈ బెదిరింపుల వల్ల తను మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని ఆ కంప్లయింట్ లో రాసుకొచ్చింది. అంతేకాకుండా అతనిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ ఈ సందర్భంగా పోలీసులను కోరినట్టు సమాచారం. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె కంప్లైంట్ మేరకు కేసును నమోదు చేసి, విచారణ చేపట్టారు.
ఇక అచ్చం ఇలాగే ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్ (Honey Rose) కూడా తనను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా ఓ సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టిన ఎర్నాకులం పోలీసులు దాదాపు 27 మందిపై కేసును నమోదు చేశారు. అందులో కీలకమైన వ్యక్తి, ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న హనీ రోజ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక అతన్ని పోలీసులు పట్టుకున్నారనే వార్తను మరువక ముందే తాజాగా నిధి అగర్వాల్ వేధింపులు అంటూ పోలీసులకు కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది.
కాగా ఈ ఏడాది నిధి అగర్వాల్ (Nidhi Agerwal) కి లక్కీ ఇయర్ కాబోతోంది. 2025 లో నిధి అగర్వాల్ తెరపై డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్స్ అయిన ప్రభాస్ (Prabhas), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతోంది ఈ అమ్మడు. పవన్ కళ్యాణ్ తో కలిసి ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) లో, అలాగే ప్రభాస్ తో కలిసి ‘రాజా సాబ్’ (The Raja Saab) అనే పాన్ ఇండియా సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో తన కెరీర్ పూర్తిగా మారిపోతుందనే ఆశతో ఉంది నిధి అగర్వాల్. మరి ఈ ఇయర్ అయినా ఆమెకు కలిసి వస్తుందేమో చూడాలి. ఇక ఈ రెండు సినిమాలతో పాటు నిధి అగర్వాల్ చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.