Mohanlal : ఇండస్ట్రిలో నటులుగా నిరూపించుకున్న ఎంతోమంది స్టార్స్ దర్శకులుగా మెగా ఫోన్ పట్టి మల్టీ టాలెంటెడ్ అన్పించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) కూడా దర్శకుడిగా తెరపై మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ‘బరోజ్’ (Barroz) అనే సినిమాతో ఆయన త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నారు. అయితే తాను దర్శకుడిగా చేసే చివరి సినిమా ఇదేనని ప్రకటించి, అభిమానులకు షాక్ ఇచ్చారు.
నటుడు, దర్శకుడు మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బరోజ్’. పూర్తి 3డీలో రూపొందుతోంది ఈ సినిమా. ఈ ఫాంటసీ డ్రామాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ దర్శకుడిగా మారిన ఆయన… మెగాఫోన్ పట్టడం కూడా ఇదే చివరి అని తాజాగా ప్రకటించారు. అలాగే ప్రేక్షకులు కళ్లద్దాలు పెట్టుకోనవసరం లేని 3డి చిత్రానికి దర్శకత్వం వహించాలనే కోరిక ఉండేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోహన్‌లాల్ వెల్లడించారు. అంతేకాదు ఈ చిత్రానికి సంగీతం అందించడానికి ఆయన ఆస్కార్-విజేత హన్స్ జిమ్మర్‌ని కూడా సంప్రదించారట.
మోహన్‌లాల్ (Mohanlal) తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బరోజ్’ మూవీకి ఎందుకు దర్శకత్వం వహించాలని అనుకున్నారో చెప్పుకొచ్చారు. కళ్లద్దాలు అవసరం లేని 3డి చిత్రానికి దర్శకత్వం వహించాలని తాను మొదట అనుకున్నానని, అయితే దాని మేకింగ్ కు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి ఆ ఆలోచనను పక్కన పెట్టినట్టు వెల్లడించారు మోహన్ లాల్. అయితే “అసాధ్యమైన పనులను చేయడం నాకు చాలా ఇష్టం. అలా బరోజ్‌ని తీయాలనే ఆలోచన వచ్చింది” అని ఆయన చెప్పాడు.
ఇక ‘బరోజ్’ 3D వెర్షన్ తలనొప్పిని కలిగించదని అన్నారు లాలెట్టన్. మోహన్ లాల్ (Mohanlal) మాట్లాడుతూ ”మంచి నిర్మాణ విలువలతో సినిమాను తీసుకు వచ్చాం. ఇప్పటికే కొంతమంది ఈ చిత్రాన్ని చూశారు. అదృష్టవశాత్తూ వారికి తలనొప్పి రాలేదు. సాధారణంగా 3డిలో సినిమా చూడటం వల్ల తలనొప్పి వస్తుందని అంటారు. బరోజ్ విషయంలో అలా ఉండదు. సినిమా కోసం ఎంత అవసరమో అంతే చేశాము” అంటూ ‘బరోజ్’ 3డీ వెర్షన్ ను చూసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో ‘బరోజ్’కి సంగీతం అందించడానికి మొదట ఆస్కార్-విజేత స్వరకర్త హన్స్ జిమ్మెర్‌ను సంప్రదించినట్లు మోహన్‌లాల్ (Mohanlal) వెల్లడించారు. మోహన్‌లాల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ “నేను హన్స్ జిమ్మర్‌కి లేఖ రాశాను. ఆయన ఈ సినిమా చేయగలరా? లేదా అనే విషయాన్ని ఆ లేఖ ద్వారా అడిగాను. అయితే తనకు అంత సమయం లేదని ఆయన బదులిచ్చాడు. అయితే చివరికి హన్స్ జిమ్మెర్ టీంలోని కొంతమంది మ్యూజికల్ ప్లేయర్‌లు ఈ సినిమాకు వర్క్ చేశారు” అంటూ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఈ సందర్బంగా మోహన్‌లాల్ ‘బారోజ్’ తరువాత సినిమాలకు దర్శకత్వం వహించనని స్పష్టం చేశారు.
కాగా ‘బరోజ్’ ప్లాట్, స్క్రీన్‌ప్లేను జిజో పున్నూస్ రాశారు. ఈ మూవీ ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డి’గామాస్ ట్రెజర్’ అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో మాయ, సీజర్ లోరెంటే రాటన్, కల్లిరోయ్ టిజియాఫెటా, తుహిన్ మీనన్, గురు సోమసుందరం ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్న ‘బరోజ్’ డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.