Drishyam 3: మలయాళ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే తెరకెక్కించగలరని చాలామంది ప్రేక్షకుల్లో ఒక ఒపీనియన్ ఫిక్స్ అయిపోయింది. అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న మలయాళ సినిమాల లిస్ట్‌లో కూడా ఎక్కువగా ఫీల్ గుడ్ సినిమాలే ఉంటాయి. అదే సమయంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక అదిరిపోయే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక భాషల్లో రీమేక్ అయిన మూవీగా రికార్డ్ అందుకున్నాడు. అదే ‘దృశ్యం’. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాగా.. దీనికి మూడో పార్ట్ ఉంటుందా లేదా అనే విషయంపై మోహన్ లాల్ క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికి క్లారిటీ
మోహన్ లాల్ ఇప్పటివరకు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు, ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించారు. కానీ మొదటిసారి దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రమే ‘బర్రోజ్’. ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేసి భారీ ఎత్తున విడుదల చేయడానికి మోహన్ లాల్ ప్లాన్ చేశారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్లిన ‘దృశ్యం 3’కు సంబంధించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుకే ఫైనల్‌గా ఈ మూవీ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు మోహన్ లాల్. అంతే కాకుండా ఇప్పటివరకు విడుదయిన ‘దృశ్యం’ రెండు భాగాల గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
Also Read: నవీన్ పోలిశెట్టికి పెళ్లి.. ప్రీ వెడ్డింగ్ టీజర్ కూడా రెడీ అంటున్న యంగ్ హీరో..
ఆరేళ్ల ముందే
‘‘దృశ్యం 2 సినిమా విడుదలవ్వడానికి ఆరేళ్ల ముందే దాని స్క్రిప్ట్ పూర్తయ్యింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వగలిగింది. కోవిడ్, దృశ్యం కలిపి మలయాళ సినీ పరిశ్రమలో చాలా మార్పులకు కారణమయ్యాయి. గుజరాత్‌లో నేను ఒక ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ప్రజలు నన్ను మోహన్ లాల్ అని గుర్తుపడుతున్నారు. దృశ్యం చూసిన తర్వాత నేను నటించిన ఎన్నో మలయాళం సినిమాలు అందరూ చూడడం మొదలుపెట్టారు’’ అంటూ ‘దృశ్యం 2’ వచ్చిన భారీ రీచ్ గురించి మాట్లాడారు మోహన్ లాల్ (Mohanlal). ఆపై ‘దృశ్యం 3’ (Drishyam 3) గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
ఫ్యాన్ మేడ్ పోస్టర్లు
‘‘దృశ్యం 3తో రావడానికి మేము ప్రయత్నిస్తున్నాం’’ అని బయటపెట్టారు మోహన్ లాల్. మొత్తానికి ఫ్యాన్స్‌కు ఒక హ్యాపీ న్యూస్ చెప్పారు ఈ మలయాళ సూపర్ స్టార్. అసలైతే ‘దృశ్యం 2’కు రెండు పార్ట్స్ మాత్రమే ఉండాలని దర్శకుడు జీతూ జోసెఫ్ నిర్ణయించుకున్నారు. కానీ ప్రేక్షకుల్లో ఈ మూవీకి ఉన్న డిమాండ్ చూసి ఆయన కచ్చితంగా మూడో భాగంతో రావాలని డిసైడ్ అయ్యారు. అప్పుడే ‘దృశ్యం 3’కు సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా బయటికొచ్చాయి. దీంతో నిజంగానే ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నిజమయితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ మూవీపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.