Monalisa : మహా కుంభమేళాలో (Maha Kumbhamela 2025) అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా (Monalisa) మొదటి సినిమాకు ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. ఈ మూవీ ఇంకా మొదలు కాకముందే కొత్త వివాదంలో పడింది. ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Dairy of Manipur) ఊహించని సమస్యలను ఎదుర్కొంటుంది. దీంతో మూవీ ఆగిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
అసలేం జరిగిందంటే?
డైరెక్టర్ మనోజ్ మిశ్రా ప్రొఫెషనల్ బిహేవియర్ ఏ మాత్రం కరెక్ట్ గా ఉండదని విమర్శలు వినిపిస్తున్నాయి. అతను ఒక తాగుబోతని, సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూసే నటీమణులతో అనుచితంగా ప్రవర్తించడం వంటివి చేస్తాడని నిర్మాత జితేంద్ర ఆరోపణలు చేయడంతో ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది.
నిర్మాత జితేంద్ర మాట్లాడుతూ “సినిమా అవకాశాల పేరుతో అతను అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్తాడు. అక్కడ అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు మోనాలిసాను పాపులారిటీ కోసం వాడుకుంటున్నాడు. మోనాలిసా, ఆమె కుటుంబం పట్ల నాకు బాధగా ఉంది. అతని బ్యాగ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకోకుండా వాళ్లు తమ కూతురిని అతనికి అప్పగించారు” అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నిర్మాత జితేంద్ర నారాయణ సింగ్ అలియాస్ వసీం రిజ్వీ. సనోజ్ మిశ్రా చిత్రానికి ఏ నిర్మాత సపోర్ట్ చేయడని, అందువల్ల సినిమా తీయడానికి తన దగ్గర డబ్బు లేదని ఆయన బాంబ్ పేల్చారు. దీంతో ఈ మూవీ మొదలు కాకముందే ఆగిపోతుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి.
మహా కుంభమేళాతో ఓవర్ నైట్ స్టార్
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ కు చెందిన మోనాలిసా మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ కెమెరా కంటికి చిక్కింది. అక్కడికి వెళ్ళిన ఓ వ్యక్తి ఆమెను కెమెరాలో బంధించి, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె అందానికి ముఖ్యంగా కళ్ళకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంకేముంది మోనాలిసాకు లైఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యి, ఆమె ఫోటోను తెగ వైరల్ చేశారు. దెబ్బకు ఆ అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆమెను చూడడానికి జనాలు ఎగబడ్డారు.
ఈ నేపథ్యంలోనే మోనాలిసా సినిమా ఆఫర్ ను దకించుకుంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను తాను తెరకెక్కిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమా కోసం తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతేకాకుండా ఆమెకు యాక్టింగ్ రాకపోతే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి వివిధ నగరాలకు వెళ్లి శిక్షణ పొందుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంకేముంది మోనాలిసా లైఫ్ సెటిల్ అనుకున్నారు అంతా. కానీ సడన్ గా నిర్మాత జితేంద్ర నారాయణ సింగ్ ఇప్పుడు సనోజ్ మిశ్రా గురించి ఇలాంటి షాకింగ్ ఆరోపణలు చేసి కొత్త వివాదాన్ని తెరపై తీసుకొచ్చారు. మరి ఈ మూవీ పట్టాలు ఎక్కుతుందా? లేదంటే అటకెక్కుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది.