Monalisa : మహా కుంభమేళాలో వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa Bhonsle)ను సినిమా అవకాశం వరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలు ఎక్కకముందే వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవలే దర్శకుడు సనోజ్ మిశ్రాపై నిర్మాత షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు మోనాలిసాతో తాను చేస్తున్న సినిమాను ఆపడానికి ప్రయత్నించారని, తన పరువు తీయడానికి ట్రై చేశారని దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపిస్తూ… ఓ యూట్యూబ్ ఛానల్ యజమానితో సహా 5 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణలు
ముంబై శివారులోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా (Sanoj Mishra) 6 మందిపై తన సినిమాను ఆపడానికి ట్రై చేస్తున్నారని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేశాడు. ఈ డైరెక్టర్ ఇటీవల ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభమేళాలో ఇంటర్నెట్ సంచలనంగా మారిన మోనాలిసాతో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి ఇచ్చిన ప్రకారం, ఫిర్యాదులో పేర్కొన్న ఐదుగురు వ్యక్తులు సినిమా బడ్జెట్, ఇతర అంశాలపై మిశ్రాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మిశ్రా దర్శకత్వం వహించిన సినిమాలు ఏవీ ఇప్పటి వరకు విడుదల కాలేదని, 16 ఏళ్ల భోంస్లే కెరీర్‌ను అతను నాశనం చేస్తాడని కామెంట్స్ చేశారని, దానిపై కూడా డైరెక్టర్ మిశ్రా కంప్లయింట్ లో ప్రస్తావించారని వెల్లడించారు. ఆ ఐదుగురు వ్యక్తుల ఆరోపణలు అవాస్తవమని మిశ్రా అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వారు ఒక టీంను ఏర్పాటు చేశారని, వాళ్ళంతా కలిసి ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోనాలిసా చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ తెరకెక్కడం వారికి ఇష్టం లేదని ఆయన అన్నారు. మిశ్రా కంప్లయింట్ మేరకు ఆ ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతోంది.
మోనాలిసాకు మూవీ ఛాన్స్ ఇలా…
జనవరిలో నర్మదా నది ఒడ్డున ఉన్న కిలా ఘాట్ వద్ద దండలు అమ్ముతూ ఓ కంటెంట్ క్రియేటర్ కంటికి చిక్కింది మోనాలిసా. మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో ఆమె రుద్రాక్ష దండలు అమ్ముతున్న ఫోటోను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఈ అమ్మాయి చివరికి ఈ నెల ప్రారంభంలో మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రానికి సైన్ చేసింది.
నిర్మాత షాకింగ్ ఆరోపణలు
ఇటీవల నిర్మాత జితేంద్ర నారాయణ సింగ్ అలియాస్ వసీం రిజ్వీ డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై షాకింగ్ ఆరోపణలు చేశారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రొఫెషనల్ లైఫ్ సరిగ్గా ఉండదని, అతను అమ్మాయిల్ని ముంబైకి తీసుకెళ్ళి అనుచితంగా ప్రవర్తిస్తాడని, మోనాలిసా జీవితాన్ని అతను నాశనం చేస్తాడని తీవ్ర విమర్శలు చేశారు.