Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రెండు వారాలు దాటుతున్నా ఇంకా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 1500 కోట్లు సాధించి ఔరా అనిపిస్తుంది.
ఇక ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకొనే పరిస్థితిలో అల్లు అర్జున్ కానీ, నిర్మాతలు కానీ లేరు. అందుకు కారణం సంధ్యా థియేటర్ ఘటన. బెన్ ఫిట్ షో చూడడానికి బన్నీ.. సంధ్యా థియేటర్ కు రావడం.. తమ అభిమాన హీరోను చూడడానికి అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకుపోవడంతో రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో మృతి చెందింది. ఇక రేవతితో ఉన్న కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు.
Manchu Manoj: విష్ణు నన్ను చంపాలని చూస్తున్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్
ఇక ఈ ఘటన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది. బన్నీపై కేసు నమోదు అయ్యింది. విచారణ నిమిత్తం బన్నీని కోర్టులో హాజరు పర్చడం, 14 రోజుల రిమాండ్ ను విధించడం జరిగాయి. జైలుకు వెళ్లకుండానే వెంటనే బెయిల్ రావడంతో.. బన్నీ బయటపడ్డాడు. ఇక బయటకు వచ్చాకా కూడా బాధితులను కలవకపోవడం ఒక ఎత్తు అయితే.. ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయకపోవడం మరో ఎత్తు. దీంతో నెటిజన్స్ బన్నీపై, పుష్ప 2 టీమ్ పై మండిపడుతున్నారు. బాధితులను కలవకపోవడానికి బన్నీ లీగల్ ఇష్యూస్ అడ్డు వస్తున్నాయని, అందుకే తన తండ్రిని పంపించినట్లు తెలిపాడు.
తాజాగా పుష్ప 2 నిర్మాతలు.. బాధిత కుటుంబాన్ని కలిసి భారీ సాయం చేశారు. ఘటన జరిగిన తదుపరి రోజే మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. ” గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. ఆ కుటుంబం మరియు వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడి ఆరోగ్యంగా బయటపడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి, వారికి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం” అని చెప్పుకొచ్చారు.
UI Movie OTT: కన్నడ స్టార్ మూవీకి ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఇక నేడు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్.. సినిమాటోగ్రాఫర్ కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి హాస్పిటల్ కి చేరుకొని బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు.
వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని, నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఇంకోపక్క ఈ ఘటన.. అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. ఒకదాని తరువాత ఒక వివాదం బన్నీపై పడుతుంది. నిన్నటికి నిన్న బన్నీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. మరి ఈ కేసు ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.