యువ కథానాయకుడు నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. బెంగుళూరుకి చెందిన అమ్మాయి అనూష శెట్టిని నవంబర్ 20న పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహం బెంగుళూరులోని జె.డబ్ల్యు మారియేట్‌లో ఘనంగా జరగనుంది. నవంబర్ 19న మెహంది ఫంక్షన్‌తో పెళ్లి వేడుక స్టార్ట్ అవుతుంది. రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. నాగ శౌర్య, అనూష శెట్టి మధ్య రెండేళ్ల స్నేహం ఉంది. రెండు కుటుంబాల సమ్మతంతో వీరిద్దరి పెళ్లి జరగనుంది. అనూష .. ఇంటీరియర్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట నాగశౌర్య పెళ్లి కార్డు వైరల్ అవుతుంది.
నాగశౌర్య గురించి మన తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో హీరోగా తనదైన గుర్తింపును ఆయన సంపాదించుకున్నారు. ఈ ఏడాది కృష్ణ వింద విహారి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. త్వరలోనే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి సినిమాలతో అలరించబోతున్నారు. హీరోగానే కాకుండా నాగశౌర్య, నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం ఛలో. తర్వాత నర్తనశాల, అశ్వథ్థామ వంటి సినిమాలను నిర్మించారు. త్వరలోనే మరికొన్ని సినిమాల్లో నాగశౌర్య హీరోగా నటిస్తూనే నిర్మిస్తున్నారు.