NagaVamsi : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో సూర్యదేవర నాగవంశీ కూడా ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు… హీరో కంటే ఎక్కువ సందడి నిర్మాతదే ఉంటుంది. సినిమాల విషయంలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు తరచుగా హాట్ టాపిక్ గా మారుతాయి. అంతేకాదు నాగ వంశీ కామెంట్స్ వివాదాలకు దారితీసి, సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. కానీ గత కొంతకాలంగా ఈ యంగ్ ప్రొడ్యూసర్ కి చిన్న సినిమాలు శాపంలా మారాయి. ముఖ్యంగా ‘హనుమాన్’ నుంచి ఈ బ్యాడ్ లక్ వెంటాడుతోంది.
నిర్మాతను వెంటాడుతున్న బ్యాడ్ లక్
2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ అయింది. రాజమౌళితో చేయబోయే సినిమాకు ముందు మహేష్ బాబు చేయబోతున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నామని మేకర్స్ మూవీపై హైప్ పెంచేశారు. కానీ మూవీ రిలీజ్ విషయంలో మాత్రం ‘గుంటూరు కారం’ వర్సెస్ ‘హనుమాన్’ అన్నట్టుగా గట్టిగానే వివాదం నెలకొంది. రెండు సినిమాలను జనవరి 12న రిలీజ్ చేయడమే అందుకు కారణం.
పైగా ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ అవుతున్న కారణంగా చిన్న సినిమా ‘హనుమాన్’ మూవీని పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. మొత్తానికి గత ఏడాది సంక్రాంతి విన్నర్ గా చిన్న సినిమా ‘హనుమాన్’ నిలిచింది. అప్పట్లో ఈ మూవీ విషయంలో నెలకొన్న వివాదం ఫలితము ఏమోగానీ… ఇప్పటిదాకా నాగ వంశీని చిన్న సినిమాల్లో వెంటాడుతున్నాయి. ఫలితంగా ఈ నిర్మాత నుంచి వచ్చిన పెద్ద సినిమాలేవి చిన్న సినిమాల ముందు నిలబడలేక పోతున్నాయి. అందుకు నిదర్శనం రీసెంట్ గా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, డాకు మహారాజ్.
దీపావళికి పేలని లక్కీ భాస్కర్
దీపావళి టైంలో నాగవంశీ రిలీజ్ చేసిన ‘లక్కీ భాస్కర్’ లక్కీ భాస్కర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా ఆడలేదు. అదే టైంలో రిలీజ్ అయిన కిరణ్ అభవరం ‘క’, ‘అమరన్’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఫలితంగా ‘లక్కీ భాస్కర్’కు ఆశించిన కలెక్షన్స్ రాలేదు.
‘డాకు మహారాజ్’కు నష్టాలు
ఇక ఇప్పుడు కూడా చిన్న సినిమా వల్లే ‘డాకు మహారాజ్’కు బ్రేకులు పడ్డాయి. ఈ సంక్రాంతికి నాగ వంశీ నిర్మించిన ‘డాకు మహారాజ్’ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 160 కోట్లు కొల్లగొట్టి ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అయినప్పటికీ ఈ మూవీ చాలా ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని తెలుస్తోంది. ఇలా ‘డాకు మహారాజ్’ దూకుడుకి బ్రేకులు పడడానికి ముఖ్య కారణం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ అని చెప్పొచ్చు. మొత్తానికి నిర్మాత నాగ వంశీని వెంటాడుతున్న ఈ చిన్న సినిమాల బ్యాడ్ లక్ ఎప్పుడు మారుతుందో చూడాలి.