Namrata Shirodkar : టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద మనసు చాటుకున్నారు. మహేశ్ బాబు సొంత ఊరైన బుర్రెపాలెంలో యువతల కోసం ప్రత్యేక టీకా డ్రైవ్ ను ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ స్టార్ కపుల్ మహేశ్ బాబు, నమ్రతా ఎప్పటికప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకోవటమే కాకుండా, గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేయించారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన బుర్రెపాలెం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నమ్రత తన పుట్టిన రోజు సందర్భంగా టీనేజ్ బాలికల గర్భాశయ ఆరోగ్యం కోసం ప్రత్యేక టీకా డ్రైవ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 70 మంది బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ పొందే టీకాలను ఇచ్చారు ఈ విషయాన్ని నమ్రతా ఇన్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
“నా పుట్టినరోజు సందర్భంగా @mbfoundationorg, @andhrahospitals సహకారంతో బుర్రిపాలెం గ్రామంలో యువతుల ఆరోగ్యం, శ్రేయస్సును కోసం ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహించాము. ఇందులో భాగంగా 70 మంది బాలికలు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను పొందారు. ఇది గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించడంలో ముఖ్యమైన దశ. ఈ విషయాన్ని మీతో పంచుకోటానికి ఎంతో సంతోషిస్తున్నా. టీకా లాభాలు పూర్తి స్థాయిలో పొందటానికి ఆరు నెలల వ్యవధిలో రెండు మోతాదులలో వీటిని అందించాలి. ఈ విషయంలో నాకు సహకరించిన డాక్టర్స్ తో పాటు ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు.. ” అని తెలిపారు.
ఇక సినిమాలో హీరోగా కొనసాగటమే కాకుండా సేవా గుణంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు మహేష్ బాబు. తన పేరుతో ఓ ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. పేద ప్రజలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వైద్య సహాయం అందిస్తున్నారు. ఆయన సహాయంతో ఎంతో మంది చిన్నారులు గుండె జబ్బులను నయం చేసుకున్నారు. ఈ వెబ్సైట్ ద్వారా మహేష్ బాబు, నమ్రత ఎందరో పేద ప్రజలకు సాయం అందిస్తున్నారు. అంతేకాకుండా సితార సైతం తన పాకెట్ మనీని ఈ వెబ్సైట్ లో సేవా కార్యక్రమాల కోసమే ఇస్తున్నట్టు అప్పట్లో తెలిపింది.
ఇక మహేష్ బాబు, నమ్రతల కుమార్తె సితార ఘట్టమనేని సైతం తల్లీదండ్రుల బాటలోనే నడుస్తుంది. తన మొదటి వేతనాన్ని సైతం ఓ స్వచ్ఛంద సంస్థకు అందజేసింది. ఓ నగల బ్రాండ్ కోసం ‘ప్రిన్సెస్’ అనే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూలో నటించిన సితార.. తనకు వచ్చిన మెుత్తం రెమ్యునరేషన్ ను విరాళంగా ఇచ్చేసింది. అంతే కాకుండా పేద పిల్లలకు సైకిల్స్ పంపిణీ చేయటం, వృద్ధులకు సహాయం చేయటం వంటి ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సితార.. తండ్రికి తగ్గ కూతురిగా అడుగులు వేస్తుంది.
ALSO READ : దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. అందించిన వెంకటేష్..!