Nayanthara: కోలీవుడ్‌లో కొన్నిరోజుల క్రితం ఇద్దరు స్టార్ల మధ్య మొదలయిన కాంట్రవర్సీ ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. నయనతార పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ (Nayanthara Beyond The Fairytale) అనే డాక్యుమెంటరీ వల్ల చిచ్చు రేగింది. అందులో ‘నానూమ్ రౌడీ ధాన్’ సినిమా షూటింగ్ సమయంలోని ఫుటేజ్‌ను జతచేర్చారు మేకర్స్. తన పర్మిషన్ లేకుండా అలా చేశారంటూ ఆ మూవీ నిర్మాత ధనుష్ చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. దీంతో నయన్ ఈ విషయంపై ఓపెన్‌గా స్పందిస్తూ ఒక పెద్ద లెటర్‌ను షేర్ చేసింది. ఇప్పటివరకు ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడని నయన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది.
పబ్లిసిటీ కోసం కాదు
ధనుష్ (Dhanush) చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పిన తర్వాత నయనతార (Nayanthara) రియాక్షన్ వల్ల ఈ వివాదం మరింత పెరిగింది. దీంతో తనవైపు తప్పు ఉందా లేదా అనే విషయంపై నయన్ స్పందించింది. ‘‘ధైర్యం అనేది నిజాయితీతోనే వస్తుంది. నేను ఏదైనా తప్పు చేస్తున్నానంటేనే భయపడాలి. తప్పు చేయడం లేదంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే విషయం చాలా దూరం వెళ్లిపోయింది. ఇప్పటికైనా నేను దీని గురించి మాట్లాడాలి. నేను కరెక్ట్ అనుకునేది చేయడానికి నేనెందుకు భయపడాలి. పబ్లిసిటీ కోసం ఒకరిని కించపరచాలి అనుకునే వ్యక్తిని కాదు’’ అంటూ ఈ విషయం గురించి మాట్లాడింది నయనతార.
Also Read: నయన్ VS ధనుష్… నయన్‌కు నోటీసులు జారీ చేసిన హై కోర్టు
తనకు ఫోన్ చేశాను
‘‘నా డాక్యుమెంటరీ కోసం పబ్లిసిటీ స్టంట్‌లాగా నేను ధనుష్‌కు ఓపెన్ లెటర్ రాయలేదు. ఈ డాక్యుమెంటరీ అనేది హిట్, ఫ్లాప్ కోసం మేము తెరకెక్కించలేదు. ఒక వ్యక్తి మనకు చాలా నచ్చితే వారి గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటాం. నానూమ్ రౌడీ ధాన్ అనే సినిమా మా జీవితాన్ని మార్చేసింది. మాకు ప్రేమ, పిల్లల్ని ఇచ్చింది. అదే మా డాక్యుమెంటరీలో చూపించాలని అనుకున్నాం. ఇదే విషయంపై ధనుష్ మ్యానేజర్‌కు ఫోన్ చేశాను. గత పదేళ్లలో ఏం జరిగిందో దానిని మార్చడానికి, దాని గురించి మాట్లాడడానికే నేనేం ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఉన్న మనస్పర్థలు తొలగిపోవడానికే చేశాను’’ అని బయటపెట్టింది నయనతార.
లిమిట్స్ దాటాడు
‘‘మేము భవిష్యత్తులో ఎప్పుడైనా కలిస్తే కనీసం ఒకరికొకరు హాయ్ చెప్పుకోవాలి అనుకున్నాను. మేము డాక్యుమెంటరీలో ఉపయోగించిన ఫుటేజ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి తీసిన వీడియో నుండి తీసుకున్నాం. అది సినిమా కాంట్రాక్ట్‌లో లేదు. అది అఫీషియల్ ఫుటేజ్ అని చెప్పడానికి లేదు. అది చూసి ధనుష్ మమ్మల్ని ఏమీ ఇబ్బందిపెట్టడని అనుకున్నాం. కానీ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలయినప్పుడు ధనుష్ లిమిట్స్ దాటి ప్రవర్తించాడు. ధనుష్ అలా చేయడం కరెక్ట్ కాదనిపించి నేను ఓపెన్‌గా లెటర్ రాశాను’’ అంటూ తను చేసిన పనిని సమర్ధించుకుంది నయనతార. మొత్తానికి ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.