Niharika About Allu Arjun Case: ఏదైనా సినిమా ఈవెంట్ జరిగినప్పుడు లేదా ఎవరైనా హీరో ఎక్కడికైనా వస్తున్నాడని తెలిసినప్పుడు అక్కడ భారీ సంఖ్యలో ప్రేక్షకులు, ఫ్యాన్స్ చేరుకోవడం సహజం. వారిని కంట్రోల్ చేయడానికి, ఏ ప్రమాదం జరగకుండా కాపాడడానికి పోలీసులు, ఇతర సిబ్బంది ఉంటారు. కానీ వారిని కంట్రోల్ చేయాలంటే ముందుగా హీరో వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అందాలి. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వస్తున్నాడని ముందుగానే ప్రకటించినా, రోడ్ షో చేయడానికి మాత్రం అనుమతి తీసుకోలేదు. దాని వల్ల ఒక మహిళ ప్రాణం పోయింది. ఈ విషయంపై మొదటిసారి మెగా ఫ్యామిలీ నుండి నిహారిక కొణిదెల స్పందించింది.
Also Read: కొడుకు సక్సెస్ అయితే చాలు.. ఆ అలవాటు మానేస్తానని మాటిచ్చిన అమీర్ ఖాన్
నిహారిక స్పందన
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో రేవతి మృతి విషయం అల్లు అర్జున్‌కు తెలిసినా తను రెండు రోజుల వరకు స్పందించలేదు. పైగా రోడ్ షోకు పర్మిషన్ లేకపోయినా చేశాడు. ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. ఇదే కేసు విషయంపై బన్నీ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. మధ్యంతర బెయిల్ లభించిన తర్వాత తాజాగా అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇప్పటివరకు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాత్రమే ఓపెన్‌గా స్పందించారు. దీనిపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్‌లోకి నిహారిక కొణిదెల కూడా చేరింది.
పెద్ద విషయం
ప్రస్తుతం నిహారిక కొణిదెల హీరోయన్‌గా నటించిన ‘మద్రాస్‌కారన్’ అనే మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ఈ మూవీ హీరో షేన్ నిగమ్‌తో కలిసి నిహారిక కూడా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటోంది. అదే సమయంలో తనకు సంధ్య థియేటర్‌లో జరిగిన రేవతి మృతి గురించి ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ఎవరికైనా ఏదో నెగిటివ్ జరగాలని ఎవరూ అనుకోరు. ఆ సందర్భంలో జరిగింది అయితే చాలా పెద్ద విషయం. ప్రాణం పోవడం అనేది అన్నింటికంటే పెద్ద విషయం. ఇంకొక్క రోజు బ్రతుకుతామనే ఆశతోనే మనం అన్నీ చేస్తూ ఉంటాం. ఒకరి ప్రాణం పోవడం అనేది అస్సలు చిన్న విషయం అని నేను అనను’’ అంటూ రేవతి మృతిపై స్పందించింది నిహారిక.
బెటర్ అవుతున్నాడు
‘‘జరిగిన ఘటనలో రేవతి మృతి దగ్గరే నా ఆలోచన ఆగిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతున్నాడు’’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల (Niharika Konidela). చాలావరకు అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన తప్పు వల్లే ఈ ఘటన జరిగిందని ప్రేక్షకులు అనుకుంటున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఈ హీరోకే సపోర్ట్ చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, పోలీసులు చెప్పింది బన్నీ వినకపోవడం వల్లే ఈ విషయం ఇంత పెద్దగా అయ్యిందని తెలిసినా కూడా తన అభిమానులు మాత్రం తనదేమీ తప్పు లేదని వాదిస్తున్నారు.