Aamir Khan: సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా.. తమకంటే తమ వారసులే సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. దానికోసం ఎంత దూరం వెళ్లడానికి అయినా ఆలోచించరు. అలాగే సినీ పరిశ్రమలో కూడా అదే జరుగుతుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు కొన్ని ఫ్లాప్స్ రాగానే వెనుదిరగక తప్పదు. కానీ వారసుల విషయంలో అలా ఎప్పటికీ జరగదు. ఎన్నేళ్లు ఫ్లాప్స్ వస్తున్నా కూడా వారిని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటారు. అమీర్ ఖాన్ కూడా అలాంటి తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఎలాగైనా తన వారసుడి సినీ డెబ్యూ సక్సెస్ అవ్వాలని, ఒకవేళ అయితే తనకు ఇష్టమైన అలవాటు మానేస్తానని మాటిస్తున్నాడు.
మరో డెబ్యూ
బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ (Aamir Khan). అయిదు నిమిషాల పాత్ర కోసం అయినా పర్ఫెక్ట్‌గా కనిపించాలి అనిపించే పిచ్చి అమీర్‌ది. అసలు బీ టౌన్‌లో తనలాగా డెడికేటెడ్‌గా ఎవరూ ఉండరని తన ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి అమీర్ ఖాన్ ఇప్పుడు తన వారసుడు జునైద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే జునైద్ ఖాన్ లీడ్ రోల్‌లో తెరంగేట్రం చేశాడు. కానీ అది వెండితెరపై కాదు.. నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘మహారాజ్’ అనే మూవీలో జునైద్ హీరోగా నటించాడు. ఇతర వారసుల మొదటి సినిమాల కంటే ఈ మూవీ కాస్త బాగానే ఉందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు.
Also Read: లక్కీ స్టార్ ఆఫ్ కేరళతో నటించడం గర్వంగా అనిపిస్తుంది.. వారిని ప్రశంసలతో ముంచేసిన త్రిష
అప్పుడే హైప్
‘మహారాజ్’ తర్వాత ప్రస్తుతం ‘లవ్యాపా’ (Loveyapa) అనే మూవీతో వెండితెరపై వెలగడానికి సిద్ధమయ్యాడు జునైద్ ఖాన్ (Junaid Khan). ఈ మూవీతో శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ కూడా నటిగా తన డెబ్యూ చేయనుంది. అలా ఇద్దరు వారసుల డెబ్యూ ఈ ఒక్క సినిమాపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా తన కుమారుడు జునైద్ ఖాన్ మొదటి సినిమా సక్సెస్ కావాలని, అలా అయితే తాను సిగరెట్ మానేస్తానని అమీర్ ఖాన్ నిర్ణయించుకున్నాడట. అలా అని దేవుడిపై ఒట్టు కూడా వేశాడట. ఇప్పటికే ‘లవ్యాపా’పై సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. జునైద్ ఖాన్, ఖుషీ కపూర్‌పై తెరకెక్కించిన ప్రమోషనల్ సాంగ్ కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది.
నటనకు ఫిదా
ఇప్పటికే అమీర్ ఖాన్.. ‘లవ్యాపా’ మూవీ రఫ్ కట్‌ను చూసి తన రివ్యూ ఏంటో బయటపెట్టాడు. ‘‘నాకు ఈ సినిమా నచ్చింది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మన జీవితాలు మొబైల్ ఫోన్స్ వల్ల ఎంతగా మారిపోయాయి, టెక్నాలజీ వల్ల మన జీవితాల్లో ఎలాంటి ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి లాంటి అంశాలు ఈ సినిమాలో చూపించారు. అందరు నటీనటులు మంచి నటన కనబరిచారు’’ అంటూ ‘లవ్యాపా’ సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాడు అమీర్ ఖాన్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ జనవరి 10న విడుదలకు సిద్ధమయ్యింది. మొత్తానికి అమీర్ ఖాన్ వారసుడి మొదటి సినిమాను తనకు గుర్తుండిపోయేలా చేయాలని తండ్రి కష్టపడుతున్నాడు.