Nithya Menen: గ్లామర్ ప్రపంచంలో ముందుకు వెళ్లాలి, ఇతర హీరోయిన్ల కంటే ముందుగా అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనే ప్రెజర్ ఉంటుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం అలాంటి ప్రెజర్ తీసుకోకుండా తమ కెరీర్‌ను సాఫీగా కొనసాగిస్తుంటారు. అలాంటి వారిలో నిత్యా మీనన్ (Nithya Menen) ఒకరు. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఎంత మంచి కథ ఉన్నా.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా దానిని రిజెక్ట్ చేసేస్తుంది నిత్యా మీనన్. అందుకే తన ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అంటే చాలామందికి ఇష్టం. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు హిట్స్ అందుకున్న నిత్యా.. తరచుగా అక్కడ సినిమాలు చేయకపోవడానికి కారణాలు బయటపెట్టింది.
నేషనల్ అవార్డ్ నటి
నిత్యా మీనన్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్‌కు మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్‌కు కూడా చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. తనకు ఏదైనా నచ్చకపోతే ముక్కుసూటిగా చెప్పడం తనకు అలవాటు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి, తరచుగా ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఆలోచనలో నిత్యా ఉండదు. తను ఒక పాత్ర చేసిందంటే అది ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని అనుకుంటుంది. అందుకే ‘తిరుచిత్రంబలం’ లాంటి మూవీలో శోభన అనే పక్కింటమ్మాయి పాత్రలో నటించింది. దాంతోనే నేషనల్ అవార్డ్ సైతం సొంతం చేసుకుంది. అయితే మసాలా సినిమాల్లో నటించకపోవడానికి అసలు కారణమేంటో బయటపెట్టింది నిత్యా. అంతే కాకుండా బాలీవుడ్‌పై ఆసక్తికర స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.
Also Read: సాయి పల్లవిని వెలివేస్తున్న ప్రేక్షకులు, ట్విటర్‌లో ట్రెండింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
అలాంటి సినిమాలు చూడను
నేషనల్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. ‘‘అవార్డులపై నేనెప్పుడూ ఫోకస్ చేయలేదు. నాకు గుర్తింపు రావాలి అనేదానికంటే నా పనిపైనే ఎక్కువ దృష్టిపెట్టాను. సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నా మీద ఒకేలాగా ప్రభావం చూపిస్తుంది. అది పట్టించుకోకుండా వెంటనే తరువాతి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. మసాలా సినిమాలపై తన అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది నిత్యా. ‘‘మసాలా సినిమాల్లో నటించాలని నేనెప్పుడూ ఒత్తిడి తీసుకోను. ఎందుకంటే అవి నా ఇష్టాలకు తగినట్టుగా ఉండవు. నాకు అలాంటివి ఇంట్రెస్ట్ కూడా ఉండవు. అందుకే మసాలా సినిమాలు చూడను, అందులో నటించకుండా ఉండడానికి ఫీల్ అవ్వను’’ అని తెలిపింది.
రేంజ్ తెలియదు
నిత్యా మీనన్ ఇప్పటికే హిందీలో ‘మిషన్ మంగళ్’ అనే సినిమాతో పాటు ‘బ్రీత్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఈ రెండు మంచి సక్సెస్ అందుకున్నా కూడా తను బాలీవుడ్ వైపు అంతగా ఆసక్తి చూపించకపోవడానికి కారణమేంటో చెప్పుకొచ్చింది. ‘‘బాలీవుడ్ వాళ్లకు నా రేంజ్ ఏంటో, నేను చేయగలిగిన పాత్రలు ఏంటో తెలుసు అని నాకు అనిపించడం లేదు. పైగా అక్కడ హీరోయిన్ అంటే ఒకే రకమైన పాత్రలు చేయాలి అనే మూఢనమ్మకం కూడా ఉంది’’ అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది నిత్యా. బాలీవుడ్ దర్శకుల్లో తనకు విక్రమాదిత్య మోత్వానే అంటే ఇష్టమని బయటపెట్టింది. ఆయనతో కలిసి ఎప్పటికైనా వర్క్ చేయాలనుందని తెలిపింది.