Nutan Prasad Birthday Special : తడినాధ వరప్రసాద్.. అదేనండి మన నూతన ప్రసాద్.. విలన్ గా తన వైవిధ్యమైన నటనతో దడ పుట్టించి.. కమీడియన్ గా కడుపుబ్బ నవ్వించి.. ఎమోషనల్ సన్నివేశాలలో కంటతడి పెట్టించి.. మొత్తానికి తెలుగింటి ప్రేక్షకులను అన్ని రకాలుగా మెప్పించిన గొప్ప నటుడు. డిసెంబర్ 12 1945లో.. కృష్ణాజిల్లా లోని కైకలూరులో జన్మించాడు వరప్రసాద్. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరూ నూతన ప్రసాద్ ని ముద్దుగా నూటొక్క జిల్లాల అందగాడా అని పిలిచేవారట.
హెచ్ఎఎల్ లో ఉద్యోగం చేసుకుంటూనే రంగస్థలంపై తనకున్న మక్కువతో అప్పుడప్పుడు నాటకాలు కూడా వేసేవాడు. ఆ తర్వాత డైరెక్టర్ భాను ప్రకాష్ తో నూతన ప్రసాద్ కు పరిచయమైంది. భాను ప్రకాష్ స్థాపించిన కళారాధన అనే సంస్థ తరఫున నూతన ప్రసాద్ కొన్ని నాటకాలలో నటించారు. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ పై ఉన్న మక్కువతో.. 1973లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఎన్నార్ నటించిన అందాల రాముడు అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. 1975లో బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు చిత్రంలో.. రావు గోపాల్ రావు తో కలిసి విలన్ పాత్ర పోషించాడు నూతన ప్రసాద్. ఆ పాత్ర అతనికి మంచి గుర్తింపు తేవడంతో తరువాత వరుసగా విలన్ గా మంచి ఆఫర్స్ వచ్చాయి. విలక్షణమైన నటన కనబరుస్తూ విలన్ పాత్రలో కూడా కామెడీని పండించడం నూతన ప్రసాద్ స్టైల్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి స్టార్ హీరోలు అందరి మూవీస్ లో విభిన్నమైన పాత్రలు పోషించారు.
అతని కెరీర్లో నాలుగు నంది అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనుకోకుండా షూటింగ్లో జరిగిన ఒక సంఘటన కారణంగా నూతన ప్రసాద్ వీల్ చైర్ కి పరిమితం అయిపోయాడు. 1989లో రాజేంద్రప్రసాద్ హీరోగా ..భానుమతి ముఖ్యపాత్రలో నటించిన బామ్మ మాట బంగారు మాట చిత్రంలో రాజేంద్రప్రసాద్ తాతగా నూతన ప్రసాద్ నటించారు. ఈ మూవీ చివరి షూటింగ్ ఘటంలో కారు ఆకాశంలో ఎగిరే ఒక తమాషా సన్నివేశం ఉంది ..మీకు గుర్తుందా? ఆ సీన్ షూటింగ్ జరిగే సమయంలో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం కారణంగా నూతన ప్రసాద్ వెన్నుపూస తీవ్రంగా గాయపడింది. జెసిబి తో కారును పైకెత్తి తీస్తున్న ఆ సన్నివేశంలో కారుకు కట్టిన చైన్ అనుకోకుండా తెగిపోయింది.
వెన్నుపూస విరగడం తో నూతన ప్రసాద్ పూర్తిగా వీల్ చైర్ కి పరిమితం అయిపోయాడు. అయినా అతనిలోని నటుడు మాత్రం ఏ పరిస్థితికి పరిమితం కాను అని నిరూపించుకున్నాడు. అంత జరిగిన.. నూతన ప్రసాద్ నటించిన మాత్రం ఆపలేదు. అయితే ఇంతకుముందు లాగా ఫుల్ పాత్రలు కాకుండా.. ఎన్నో సినిమాల్లో అతిథి పాత్రలో నటించి మెప్పించారు. నర నరాల్లో నటనను నింపుకొని.. నటనే జీవితంగా బతికిన నూతన ప్రసాద్.. 2011 మార్చి 30 న తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.
పుట్టినరోజు సందర్భంగా.. ఈ విలక్షణమైన నటుడిని.. ఒక్కసారి స్మరించుకుందాం..