Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. అంటే తనకు కేవలం తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా, ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే రామ్ చరణ్‌తో సినిమా చేయాలని సౌత్‌తో పాటు నార్త్ మేకర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకే దాదాపు మూడేళ్లు కేటాయించాడు చరణ్. అందుకే ఇంక ఆలస్యం చేయకుండా బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ‘ఆర్సీ 16’ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. తాజాగా ఒక బాలీవుడ్ దర్శకుడిని రామ్ చరణ్ స్వయంగా కలిశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సెన్సేషనల్ డైరెక్టర్‌తో
గతేడాది విడుదలయిన ఎన్నో హిందీ సినిమాల్లో ఒకటి ‘కిల్’. కానీ ఇది మిగతా సినిమాల్లాగా కాదు. మామూలుగా బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు చాలానే వస్తుంటాయి. కానీ అందులో ‘కిల్’ చాలా డిఫరెంట్. ఇప్పటివరకు ఏ హిందీ సినిమాలో లేని రేంజ్‌లో వైలెన్స్ చూపించి అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా పలు ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యి వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి ఒక సెన్సేషనల్ సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. తాజాగా ఈ దర్శకుడి కన్ను రామ్ చరణ్‌పై పడిందట. తనతో కలిసి ఒక సినిమా చేయాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ
రామ్ చరణ్‌తో కలిసి ఒక మైథలాజికల్ సినిమా చేయాలని నిఖిల్ నగేష్ భట్ (Nikhil Nagesh Bhat) ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్‌తో సినిమా చేయడానికి మురద్ ఖేటని అనే నిర్మాత సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రామ్ చరణ్‌తో సినిమా వర్కవుట్ అయితే మురద్ దానిని నిర్మించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ సైతం బాలీవుడ్‌లో తన అడుగుపడాలనే ఉద్దేశ్యంతో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ లో నటిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా ఎన్‌టీఆర్‌నే ఫాలో అవుతూ బాలీవుడ్‌లో అడుగుపెడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఇలా ఉండబోతుందా.? ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే.!
కథలు వింటున్నాడు
ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న స్పోర్ట్స్ డ్రామాపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్ (Ram Charan). ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ‘ఆర్సీ 16’కు సంబంధించిన ఇతర వివరాలు ఏమీ బయటికి రాకపోయినా వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ‘ఆర్సీ 16’ తర్వాత సుకుమార్‌తో ఒక మూవీని లైన్‌లో పెట్టాడు చరణ్. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరొక సినిమా గురించి ఆలోచించడం వల్లే రామ్ చరణ్ కెరీర్‌లో గ్యాప్ వచ్చింది. ఇకపై అలా జరగకూడదని ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే ఇతర దర్శకులతో చర్చలు జరుపుతూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు రామ్ చరణ్.