Saif Ali Khan Health Update : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కు ప్రస్తుతం సర్జరీ పూర్తయింది. సర్జరీ అనంతరం ఆయన హెల్త్ ఎలా ఉందన్న అప్డేట్ ని తాజాగా టీం రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆ అప్డేట్ లో సైఫ్ ప్రమాదం నుంచి బయట పడినట్టేనని వెల్లడించారు.
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ అప్డేట్
తాజాగా సైఫ్ టీం “సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కు సర్జరీ పూర్తయింది. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సైఫ్ కోలుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా క్షేమంగానే ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు” అని ఓ ప్రకటనలో వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ కు న్యూరో సర్జన్ డాక్టర్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జైన్ ఇద్దరు కలిసి సైఫ్ కు సర్జరీ చేశారు. ఈ సందర్భంగా లీలావతి హాస్పిటల్ లోని డాక్టర్ ఉత్తమని, డాక్టర్ లీనా జైన్, డాక్టర్ నితిన్ డాంగే లతోపాటు మిగతా ఆసుపత్రి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక త్వరలోనే సైఫ్ అలీఖాన్ కు చికిత్స అందిస్తున్న బృందం మీడియాకు వివరాలు తెలియజేయబోతున్నట్టు వెల్లడించారు.
ఈరోజు ఉదయం సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మీద దాడి జరిగిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరు చోట్ల కత్తి గాయాలు కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ కు రెండు చోట్ల లోతుగా గాయాలు అయ్యాయని, వెన్నుముక పక్కన కూడా కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడని, అతన్ని ఆపడానికి ప్రయత్నించిన సైఫ్ పై దాడి జరిగిందని, 3.30 గంటలకు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారని పోలీసులు వివరించారు. ఇక ప్రస్తుతం సర్జరీ జరిగి, సైఫ్ కోలుకుంటున్నారు అనే వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
లీలావతి ఆసుపత్రికి సెలబ్రిటీలు
సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలుసుకొని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని పలకరించడానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే షారుఖ్ (Shah Rukh Khan) ఆసుపత్రికి బయలుదేరిన వీడియోలు నెట్టెంట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఆస్పత్రి దగ్గర సైఫ్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు ఆయన యోగక్షేమాలు అక్కడే ఉండి చూసుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇప్పటికే సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది వచ్చిన ‘దేవర’ మూవీతో సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ మూవీ లవర్స్ కి కూడా దగ్గరయ్యారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు సైఫ్ అభిమానులు.