Sankranthiki Vasthunnam: మామూలుగా సంక్రాంతి అనేది మూవీ లవర్స్‌కు సినిమాల పండుగ అంటుంటారు. ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి పలు తెలుగు సినిమాలు బరిలోకి దిగాయి. అందులో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలతో పాటు ఒక యంగ్ హీరో మూవీ కూడా ఉంది. అయితే ఈ మూడు చిత్రాల్లో ఫ్యామిలీస్‌కు బాగా దగ్గరయిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో దూసుకుపోతోంది. మూవీ హిట్ అవుతుందని నమ్మకం ఉన్నా ఇప్పటికీ మేకర్స్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే ఉన్నారు. అదే సందర్భంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం బయటికొచ్చింది.
జంట అదిరింది
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీ ప్రేక్షకులకు నచ్చడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ పెయిర్. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసేలా చేయడం కోసం ‘గోదారి గట్టు’ అనే పాటను చాలాకాలం క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఆ పాట లిరికల్ వీడియోతోనే వీరి కెమిస్ట్రీ అందరికీ అర్థమయిపోయింది. మొదట్లో చాలామంది ప్రేక్షకులు అసలు ఐశ్వర్యను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు, వెంకటేశ్ పక్కన తన జోడీ ఎలా ఉంటుంది అని అనుమానాలు వ్యక్తం చేసినా మూవీ చూసిన తర్వాత మాత్రం ఈ జంటకు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు.
ఛాన్స్ మిస్ చేసుకున్నారు
‘సంక్రాంతికి వస్తున్నాం’లో భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh)ను సెలక్ట్ చేసేముందు పలువురు హీరోయిన్ల పేర్లు పరిగణనలోకి తీసుకున్నామంటూ తాజాగా బయటపెట్టారు మేకర్స్. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తనకు స్వయంగా చెప్పాడంటూ ఐశ్వర్య రాజేశ్ కూడా చెప్పుకొచ్చింది. ఈ సినిమాను హీరోయిన్స్ రిజెక్ట్ చేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇందులో భాగ్యలక్ష్మి నలుగురు పిల్లలకు తల్లిగా నటించింది. అయినా కూడా ఈ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ హీరోయిన్లు అర్థం చేసుకోలేకపోయారని అనిల్ తనతో చెప్పినట్టు రివీల్ చేసింది ఐశ్వర్య రాజేశ్. సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది.
Also Read: మహాకుంభమేళలో షూటింగ్.. దద్దరిల్లిపోయే అప్డేట్ ఇచ్చిన బోయపాటి
ప్రమోషన్స్‌లో యాక్టివ్
తెలుగమ్మాయి అయినా కూడా ఐశ్వర్య రాజేశ్‌కు ఇప్పటివరకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. గుర్తింపు విషయం పక్కన పెడితే.. తనకు ఇప్పటివరకు తెలుగు మేకర్స్ సరిగా అవకాశాలు కూడా ఇవ్వలేదు. అలాంటిది వెంకటేశ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకుంది. అంతే కాకుండా ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఐశ్వర్య పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండడం కూడా తనకు ప్లస్ అయ్యింది. అంతే కాకుండా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొని అప్పుడే అందరి మనసును దోచేసుకుంది ఐశ్వర్య రాజేశ్. ఇది టాలీవుడ్‌లో కచ్చితంగా తన కెరీర్ మలుపు తిరిగేలా చేస్తుందని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు.