Ustaad Bhagath Singh : రీమేక్ సినిమాల డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)కి గడ్డు కాలం నడుస్తోంది. అసలే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిజాస్టర్ తో డీలా పడ్డ ఈ డైరెక్టర్ కి తాజాగా షరతులు మీద షరతులు పెడుతూ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షాక్ ఇచ్చారనే టాక్ బయటకు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ చాలా కండిషన్స్ పెట్టారట. మరి ఆ కండిషన్స్ ఏంటి అంటే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓవైపు రాజకీయాలకు సమయం కేటాయిస్తూనే, మరో వైపు తను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ఎక్కువగా ఆయన రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ప్రజాసేవే ముఖ్యం అంటూ సినిమాలకు తక్కువ సమయాన్ని కేటాయిస్తానని ముందే చెప్పారు. ఇక చెప్పినట్టుగానే సినిమాలకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదివరకులా కాస్త డేట్స్ అటూ ఇటూ అయినా పర్లేదు అన్నట్టుగా కాకుండా, ఇచ్చిన డేట్స్ ఉపయోగించుకుంటే మంచిది లేదంటే ఏం చేయలేం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పవన్.
ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటిస్తున్న ‘ఓజి’, ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరోవైపు ‘ఓజి’ సినిమాకు సంబంధించిన పనులు కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఈ రెండు సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. పవన్ తో సినిమా కోసం హరీష్ శంకర్ చాలా కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఇక త్వరలోనే ఆ శుభ ముహూర్తం రాబోతోంది అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి దిమ్మతిరిగే కండిషన్స్ పెట్టినట్టు సమాచారం. ఇక ఆ కండిషన్లు ఏంటంటే… సాధారణంగానే సినిమాలు అంటే 3 ఫైట్లు 6 పాటలు అన్నట్టుగా ఉంటాయి. అయితే ఈ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) మూవీని ఒక మంచి సందేశం ఉండే సినిమాగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ కోరారట.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) మూవీ ‘తేరి’ అనే తమిళ సినిమాకు రీమేక్ గా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కంప్లీట్ స్క్రిప్టును మళ్లీ రాయమని హరీష్ శంకర్ ని ఆదేశించారట పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో హీరోయిన్ తో అనవసరమైన సన్నివేశలు, డాన్స్, కమర్షియల్ అంశాలను తొలగించమని చెప్పారట. డిప్యూటీ సీఎం పదవి గౌరవానికి తగ్గకుండా ఉండే స్టోరీని తయారు చేయమని, ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటూనే, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ఉండాలని పవన్ కళ్యాణ్ కండిషన్స్ పెట్టారట. దీంతో హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ మూవీని మళ్లీ పవన్ ఆదేశాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారని సమాచారం.