Mansoor Ali Khan Son Arrested :ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎంతోమంది తారలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మళ్ళీ మళ్ళీ మిగతా సెలబ్రిటీలు అలాంటి పనిచేస్తూ జైలు జీవితం గడుపుతున్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా పేరు దక్కించుకున్న కన్హ మహంతి(Kanha mohanty) డ్రగ్స్ కేసులో ఇరుక్కోగా.. ఇప్పుడు కోలీవుడ్ కి చెందిన మరో వారసుడు ఏకంగా డ్రగ్స్ దందా నడుపుతూ దొరికిపోయినట్లు సమాచారం. అంతేకాదు మొన్న త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొన్నారు మన్సూర్ అలీఖాన్. నేడు డ్రగ్స్ కేసులో కొడుకు అరెస్టు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వారసుడు..
అసలు విషయంలోకి వెళితే.. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన వారసుడు అలీ ఖాన్ తుగ్లక్ (Ali Khan Tughlaq)ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే మన్సూర్ అలీ ఖాన్ కుమారుడైన తుగ్లక్ అలీఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత నెలలో చెన్నైలోని ముఖప్పరు ప్రాంతంలోని ఒక ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు సెల్ఫోన్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు కాలేజీ విద్యార్థులను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిని విచారించగా ఈయన పేరు బయటపెట్టినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో పదిమంది విద్యార్థులు అరెస్ట్..
ఇకపోతే ఈ కేసులో పదిమంది విద్యార్థులను మూడు రోజుల క్రితం అరెస్టు చేయగా.. వీరిని చెన్నై జె జె నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలోని కటంగొళత్తూరులో ఒక ప్రైవేటు కళాశాల విద్యార్థులకు విక్రయించడమే కాకుండా మెథాంఫెటమిన్ రకం డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం విద్యార్థుల సెల్ఫోన్లను సోదాలు చేయగా.. గంజాయిని ఎవరు కొనుగోలు చేశారనే విషయం తెలుసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ దందా నడుపుతూ..
ఇక ఇందులో తమిళ సినీ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ కూడా ఉన్నట్లు తెలిపారు. దాంతో అతడిని కూడా అరెస్టు చేశారు. మన్సూర్ కుమారుడు తుగ్లక్ ను దాదాపు 12 గంటల పాటు విచారించిన పోలీసులు మరో 7 మందిని డ్రగ్స్ ఆరోపణల పై అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక తుగ్లక్ అలీ ఖాన్ అలాగే ఆయన స్నేహితులపై హై గ్రేడ్ గంజాయితో పాటు డ్రగ్స్ వాడినందుకుగాను కేసు నమోదు అయిందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ కూడా జ్యుడీషియల్ కస్టడికి తరలించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడగా ఇక్కడ ఈయన మాత్రం డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడడం సరికొత్త అనుమానాలకు దారి తీస్తోంది.