Allu Arjun case:ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంధ్యా థియేటర్ ఘటన ఎంతలా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో వేశారు. ఈ షో చూడడానికి బన్నీ ఫ్యామిలీతో సహా అక్కడికి వచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన అక్కడికి భారీ బందోబస్తు మధ్య ఫ్యామిలీతో కలిసి ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారు. ఇక బన్నీని చూడాలని అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడడంతో.. తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
బన్నీకి రెగ్యులర్ బెయిల్..
ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్ట్. కానీ ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ అప్లై చేసుకోగా.. మద్యంతర బెయిలు నాలుగు వారాలపాటు లభించింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం గత కొన్ని రోజులుగా బన్నీ పిటిషన్ వేస్తున్నప్పటికీ ఎట్టకేలకు మొన్న అనగా జనవరి 3వ తేదీన నాంపల్లి కోర్టులో జరిపిన విచారణ తర్వాత ఈయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి రావాలని, పోలీసులు పెట్టే కండిషన్స్ తప్పనిసరిగా పాటించాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మళ్లీ నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ఇక నిన్న శనివారం కావడంతో మధ్యాహ్నం లోపే నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్ పూచీకత్తు పత్రాలను స్వయంగా అందజేశారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు మళ్ళీ ఈరోజు పోలీసులు నోటీసులు అందించినట్లు సమాచారం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి రామ్ గోపాల్ పేట పోలీసులు వెళ్లారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లొద్దు అంటూ బన్నీ మేనేజర్ మూర్తికి నోటీసులు అందించారు. బెయిల్ షరతులను తప్పనిసరిగా పాటించాలని కూడా పోలీసులు స్పష్టం చేశారు.
అందుకే నోటీసులు..
అయితే ఇలా ఉన్నట్టుండి మళ్లీ నోటీసులు అందివ్వడానికి గల కారణం ఏమిటంటే.. బన్నీ శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సమాచారం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు ఇలా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ బన్నీ శ్రీ తేజ్ ను పరామర్శించడానికి కిమ్స్ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ జరిగే పరిణామాలకు బన్నీనే పూర్తి బాధ్యత వహించాలని కూడా తమ నోటీసులలో పేర్కొన్నట్లు సమాచారం. ఏది ఏమైనా బన్నీకి ఈ సమస్య ఇంకా ఎన్ని రోజులు వెంటాడుతుందో అని అభిమానులు పెద్ద ఎత్తున తమ బాధను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ ఆనందాన్ని బన్నీ అనుభవించలేకపోతూ ఉండడం గమనార్హం.