Manjo VS Mohan Babu :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబం(Manchu Family) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మోహన్ బాబు(Mohan Babu) కలెక్షన్ కింగ్ గా పేరు దక్కించుకుంటే, ఆయన వారసులు మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(Manchu Manoj) కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మరొకవైపు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA ) కి రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే తన తండ్రి స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీల బాధ్యత కూడా ఆయన పైనే ఉంది.. ఇక దీనికి తోడు ఆయన కూడా తమ కుటుంబ ప్రెస్టీజియస్ మూవీగా వస్తున్న ‘కన్నప్ప’ సినిమా కూడా చేస్తున్నారు.
మోహన్ బాబు ఇంట్లో ఆస్తి గొడవలు..
ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు ఏర్పడడం వల్లే, మనోజ్ గొడవ పడుతున్నారంటూ వార్తలు రాగా.. మరొకవైపు ఆస్తుల కోసమే గొడవ పడుతున్నారంటూ అందరూ అనుకున్నారు. ఏది ఏమైనా ఈ కుటుంబంలో గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. దీనికి తోడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన కేసులో ఏకంగా సుప్రీంకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించగా.. విచారణ అనంతరం.. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
ఇదిలా ఉండగా.. తాజాగా సంక్రాంతి సంబరాలను మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు ఆయన భార్య నిర్మలాదేవితో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు (Manchu Vishnu), ఆయన భార్య విరోనిక అలాగే పిల్లలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ తాజాగా నేడు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వస్తున్నారని తెలియడంతో.. పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు మనోజ్ కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది.
మంచు మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ..
అసలు విషయంలోకి వెళ్తే.. తిరుపతిలోని తాజ్ హోటల్లో స్టే చేసిన మనోజ్.. ర్యాలీ నిర్వహిస్తూ రంగంపేట రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 100 మంది పోలీసులు ఆయన నివాస గృహం, యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద మోహరించారు. కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసివేసి, మనోజ్ కు నోటీసులు పంపించినట్లు సమాచారం.
శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరణ..
ముఖ్యంగా శాంతిభద్రతల దృష్ట్యా మనోజ్ యూనివర్సిటీకి వచ్చేందుకు అనుమతి లేదని నోటీసుల్లో పోలీసులు తెలిపారు. అందుకే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం మంచు మనోజ్ దంపతులు నారావారిపల్లి లో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసిన ఈ జంట.. ఇప్పుడు ర్యాలీగా వస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మనోజ్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.