Poonam Kaur: ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసాని కృష్ణమురళి ఆరోగ్యం సరిగా లేదని ఇప్పటికే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం పోలీసులు పోసానిని అరెస్ట్ చేయగా అప్పటినుండి ఆయన ఆరోగ్యం బాలేదని సమాచారం. ముందుగా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు పోసాని. తాజాగా ఛాతిలో నొప్పి అని చెప్పడంతో పోలీసులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై వైద్య పరీక్షలు అన్నీ జరిగిన తర్వాత అసలు పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తేల్చారు. దీంతో పూనమ్ కౌర్ ఈ విషయంపై ట్వీట్ చేసింది. పోసానికి సపోర్ట్‌గా మాట్లాడుతూ పోలీసులకు రిక్వెస్ట్ చేసింది.
పూనమ్ సపోర్ట్
పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో పోసాని ఆరోగ్యం గురించి మాట్లాడడం మాత్రమే కాదు.. ఏపీ రాజకీయాలపై కూడా ఆమె కామెంట్ చేసింది. ‘ఏపీ రాజకీయాలు ఇతర రాష్ట్రాలకంటే దారుణంగా ఉన్నాయి. కొందరిపై బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పోసాని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి’ అంటూ పూనమ్ కౌర్ (Poonam Kaur) రిక్వెస్ట్ చేసింది. మామూలుగా పూనమ్ కౌర్ ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందో అర్థం కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. కానీ తన శత్రువులకు శత్రువులను తను ఎప్పుడూ మిత్రుల్లాగా చూస్తుంది కాబట్టి ఇప్పుడు పోసానికి సపోర్ట్‌గా నిలబడిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే అరెస్ట్
పవన్ కళ్యాణ్‌పై, ఆయన భార్యపై, కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వల్ల ముందుగా పోసాని కృష్ణమురళికి ఇబ్బందులు మొదలయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులో భాగంగా పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి ఆయన నివాసం నుండే పోసానికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. దీంతో ఒకసారిగా ఆయన మానసికంగా ఇబ్బందికి గురయ్యారని సమాచారం. అందుకే జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయనకు వాంతులు, విరోచనాలు కూడా అయ్యాయట. దీంతో అప్పటినుండే పోసానికి చికిత్స మొదలయ్యింది.
Also Read: పోసానికి ఏం అవ్వలేదు.. అంత డ్రామాలే.. డాక్టర్లు ఏం అన్నారంటే.?
ఎలాంటి సమస్యలు లేవు
వాంతులు, విరోచనాలు తగ్గిన తర్వాత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి ఛాతిలో నొప్పిగా పోలీసులకు చెప్పారని సమాచారం. దీంతో వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆయనను తరలించారు పోలీసులు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కడప రిమ్స్‌కు ఆయనను తరలించారు. అక్కడ కూడా ఆయనకు పలు వైద్య పరీక్షలు జరిగాయని తెలుస్తోంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అసలు పోసానికి ఎలాంటి సమస్య లేదని వైద్యులు స్వయంగా వెల్లడించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో పోసానిని మళ్లీ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయనకు నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.