Shah on Manipur : జాతుల వివక్షతో రణరంగంగా మారిన మణిపూర్ లో తిరిగి శాంతి భద్రతల్ని తిరిగి నెలకొల్పేందుకు కేంద్రం వరుస చర్యలకు ఉపక్రమించింది. తాజాగా.. మణిపూర్‌లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం, మార్చి 1న న్యూదిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన హోం మంత్రి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుండగా.. మార్చి 8 నుంచి జనజీవనం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని సూచించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించాలని ఆయన ఆదేశించారు. మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచెను త్వరగా పూర్తి చేయడం, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మణిపూర్ లో వివిధ తిరుగుబాటు గ్రూపులు పోలీసులు, భద్రతా దళాల నుంచి దోచుకున్న ఆయుధాల్ని తిరిగి అప్పగించాలని ఆ రాష్ట్ర గవర్నర్ విధించిన డెడ్ లైన్ ను పొగిడించిన మరుసటి రోజే అమిత్ షా ప్రకటన వెలువడింది. ప్రస్తుతం భారత ఆర్మీ ఆధీనంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో గవర్నర్ పిలుపుతో.. ఇప్పటికే సాయుధ రాడికల్ మెయిటీ గ్రూప్ అరంబై టెంగోల్ దాదాపు 250 ఆయుధాలను అప్పగించింది. మిగతా గ్రూపులు సైతం నెమ్మదిగా ఆయుధాల్ని సరెండర్ చేస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, మణిపూర్ భద్రతా సలహాదారు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్‌లు హాజరయ్యారు. వీరందరి నుంచి క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, భద్రతా బలగాల వ్యూహరచనలపై చర్చించిన హోం మంత్రి.. రాష్ట్రంలో ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో.. ఏ కారణాన్ని అడ్డుపెట్టుకునైనా ప్రజా జీవనానికి అడ్డంకులు సృష్టించినా, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినా.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా.. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Also Read : Chinese Company’s : త్వరగా పెళ్లి చేసుకోండి.. లేదంటే ఉద్యోగం ఊస్టింగే – భలే ఫిట్టింగ్ పెట్టారుగా
మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నియమించిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షా భద్రతా అధికారులను ఆదేశించారు. అలాగే.. మణిపూర్‌ను మాదకద్రవ్యాల రహితంగా మార్చడానికి..మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని, అందుకు ప్రత్యేక వ్యూహాల్ని అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మే 3, 2023 నుంచి జాతి సంఘర్షణ ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. లోయలోని మెజార్టీ మెయితీ ప్రజలు, కొండ పైన ఉండే షెడ్యూల్డ్ తెగ కుకి-జో వర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో, 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ పరిస్థితుల్ని మార్చేందుకు కేంద్రం తీవ్రంగా పని చేస్తోంది.