APFDC: సినిమా ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలన్న ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. అందుకే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వారు ప్రభుత్వాలతో చాలా సన్నిహితంగా ఉంటూ ఇండస్ట్రీకి కావలసినటువంటి సహాయాలను ప్రభుత్వం నుంచి పొందుతూ ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది. ఇలా సినిమా పరిశ్రమ నుంచి ఏదైనా కీలక అంశాలను ప్రభుత్వానికి చేరవేయడంలో ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్లు కీలక బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫిలిం డెవలప్ చైర్మన్గా(TFDC) ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నియమించిన విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్యలు తలెత్తితే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే బాధ్యతలను దిల్ రాజు తీసుకున్నారు. ఇందులో భాగంగానే గతంలో అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ అయిన దిల్ రాజు కలుగజేసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించారు. ఇలా తెలంగాణాలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా(AP FDC) ఒకరిని నియమిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం.
ఏయం రత్నం..
పవన్ కళ్యాణ్ ఆలోచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా మరొక నిర్మాత ఏయం రత్నం (A.M.Ratnam)గారిని నియమించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరు మల్లు సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ అనే ప్రకటన రావడంతో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
థియేటర్ల నిర్వహణ..
ఇలా ఈ ఘటన జరిగిన అనంతరం ఏపీలో కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఒకరిని నియమిస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారనే విషయం బయటకు రావడంతో ఇది కాస్త ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించలేదు. ఇకపోతే ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ థియేటర్ల నిర్వహణపై సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కు కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేక్షకుల కుటుంబంతో కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూసే పరిస్థితులు లేవు. ఇలా కుటుంబంతో సహా ప్రేక్షకులు థియేటర్లకు రావాలి అంటే టికెట్ ధరలు, ఫుడ్ ధరలు కూడా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ థియేటర్ల నిర్వహణపై కూడా పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలను జారీచేశారు.