Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా సంవత్సరాలవుతుంది. అయితే ఈయన నటించిన హరిహర వీరమల్లు(Hari hara Veeramallu) సినిమా త్వరలోనే ప్రేక్షకులకు రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా ఇన్నాళ్లకు విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి ఈ సినిమాని జూన్ 26వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కాబోతుందని మొదట్లో ప్రకటించిన సమయంలో ఎగ్జిబిటర్లు ఒక్కసారిగా థియేటర్ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తప్పుడు సమాచారం…
ఇలా జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లను బందు చేయాలని పిలుపునివ్వడంతో ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా విడుదలవుతుందని తెలిసి కూడా థియేటర్ బందుకు పిలుపునివ్వడంతో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయితే కొంతమంది సమక్షంలో ఈ వ్యవహారం నడిచిందని కొంతమంది ప్రొడ్యూసర్ల పేర్లు బయటికి రావడంతో వారంతా ప్రెస్ మీట్ లు పెట్టి తమకు సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడం ఎవరి సాధ్యం కాదు అంటూ మాట్లాడారు. థియేటర్లు బంద్ అంటూ ఎవరు ఎక్కడ ప్రకటించలేదని కొంతమంది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ సమర్ధించుకున్నారు.
కావాలనే టార్గెట్ చేశారు…
తాజాగా మరొక ప్రొడ్యూసర్ బన్నీ వాసు(Bunny Vasu) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బన్నీ వాసుకు ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఈ విషయం గురించి బన్ని వాసు మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి నాకు పూర్తి సమాచారం తెలియదు కానీ నాకున్న సమాచారం ప్రకారం కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేశారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
వాట్సాప్ స్క్రీన్ షాట్స్…
తెలంగాణ ఏపీకి చెందిన కొంతమంది ఎగ్జిబిటర్ల వాట్సాప్ గ్రూప్ లో పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలని చర్చలు జరిగాయని పవన్ కళ్యాణ్ సినిమాని ఆపితే కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని గ్రూప్ లో చర్చలు జరిగాయని బన్నీ వాసు తెలిపారు. అయితే అందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లాయని తెలియజేశారు. ఇలా ఈ చర్చలు జరిగిన తర్వాత ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయాలని ఫోన్ కాల్స్ కూడా వెళ్లాయి కానీ, అప్పటికే అక్కడ నుంచి వార్నింగ్ గట్టిగా రావడంతో సైలెంట్ అయ్యారు అంటూ బన్నీ వాసు ఈ సందర్భంగా థియేటర్ ఇష్యూ గురించి, ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేశారని వెల్లడించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇలా పక్క ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీపై ఆ రేంజ్ లో ఫైర్ అయ్యారని స్పష్టం అవుతుంది.