Producer Dil Raju: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు (Dil Raju) తాజాగా సినిమా ఇండస్ట్రీని బ్రతికించుకోవడానికి తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా టికెట్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రతి ఒక్కరికి ధీటుగా దిల్ రాజు నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ లయ (Laya) కీలక పాత్రలో నటిస్తూ.. యంగ్ హీరో నితిన్ (Nithin) హీరోగా వస్తున్న చిత్రం తమ్ముడు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు.
టికెట్ ధరల పెంపు పై దిల్ రాజు కీలక నిర్ణయం..
దిల్ రాజు ఈవెంట్ లో మాట్లాడుతూ.. తమ్ముడు సినిమాకి ధరలు పెంచమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడగను అని ఆయన తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తనకు ఆదర్శమని, తాను పవన్ సూచనలను అనుసరిస్తున్నాను అంటూ తెలిపారు. ఇకపోతే థియేటర్లలో ధరల నియంత్రణ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు ఫాలో అవుతున్నానని తెలిపిన దిల్ రాజు.. ఏపీలో థియేటర్లలో ధరల నియంత్రణకు డీసీఎం పవన్ తీసుకున్న చర్యలు గురించి తెలంగాణ మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో ప్రతిపాదించామని కూడా తెలిపారు.
ఇదే విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ..” సినిమా పరిశ్రమ బ్రతకాలి అంటే సినిమా పరిశ్రమలో మార్పులు రావాలి. అందుకే నా సినిమాలకు ఇకపై టికెట్ ధరలు పెంచను. ప్రస్తుతం రాబోతున్న తమ్ముడు చిత్రానికి కూడా ధరలు పెంచమని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను నేను అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం పై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఇప్పుడు వాటిని నేను ఫాలో అవుతున్నాను. నేనే కాదు నిర్మాతలు అందరూ కూడా ఈ సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి.
దిల్ రాజు నిర్ణయానికి మిగతా నిర్మాతలు కట్టుబడి ఉంటారా?
ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచము. అటు తెలంగాణలోనే కాదు ఏపీలోని థియేటర్ల నిర్వహణను కూడా పగడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఇటీవల ఆదేశించారు. ముఖ్యంగా ధరలు పెంపు కోసం నిర్మాతలు వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, ప్రేక్షకులు కుటుంబంతో సహా సినిమా హాల్ కి రావాలి అంటే అన్నింటి ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు దిల్ రాజు.
మొత్తానికైతే సినిమా పరిశ్రమను బ్రతికించుకోవడానికి దిల్ రాజు తీసుకున్న నిర్ణయం చూసి అందరూ మెచ్చుకుంటూ మిగతా నిర్మాతలందరూ చూసి నేర్చుకోండి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ‘తమ్ముడు’ సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. స్వాసిక , సప్తమి గౌడతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ALSO READ:Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కే.మహేంద్ర మృతి!