Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టార్‌గా నిలిచిన సినిమాల్లో అజ్ఙాతవాసి (Agnyaathavaasi) కూడా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. జల్సా, అత్తారింటికి దారేది తర్వా వచ్చిన కాంబో కావడంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది అజ్ఙాతవాసి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) బ్యానర్ పై చినబాబు నిర్మించారు. ఇక ఈ సంస్థ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ మొదలుపెట్టి ప్రస్తుతం నిర్మాతగా దూసుకుపోతున్నారు నాగవంశీ (Nagavamshi). అయితే.. తాజాగా నాగవంశీ అజ్ఙాత వాసి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘అజ్ఞాతవాసి’ కోసం భారీ ఖర్చు
ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరుగా దూసుకుపోతున్న నాగవంశీ.. ఈ వారంలో మ్యాడ్ స్క్వేర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో.. అజ్ఞాత వాసి సినిమా లెక్కలు చెప్పుకొచ్చాడు. గతంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నా సినీ కెరీర్‌లో అజ్ఞాత వాసి ఒక ఛాలెంజింగ్ మూమెంట్ అని, ఆ ఫ్లాప్ నుంచి బయటకి రావడానికి రెండు నెలల సమయం పట్టిందని అన్నాడు. కానీ అరవిందసమేత సినిమా (Aravinda Sametha Veera Raghava) ద్వారా దాని నుంచి బయట పడ్డాం.. అని అన్నారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు బాగానే డబ్బులు వచ్చాయని చెప్పుకొచ్చాడు. కానీ సినిమా రిలీజ్ చేసిన టైం బాగాలేకపోవడంతో కలిసి రాలేదని చెప్పాడు.
‘అజ్ఞాతవాసి’ రాంగ్ టైం
2018లో అజ్ఞాతవాసి రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ సినిమాకు 70 కోట్ల వరకు ఖర్చు చేశారు మేకర్స్. రిలీజ్‌కు ముందే 150 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్నారు. దీంతో.. ఆ సమయంలో అత్యధిక మార్కెట్ కలిగిన తెలుగు సినిమాగా అజ్ఙాత వాసి ఉంది. అందుకుతగ్గట్టే.. ఆ సినిమా ద్వారా మేము చాలా డబ్బు సంపాదించాము. కానీ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో.. తిరిగి చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు నాగవంశీ. అజ్ఙాతవాసి విడుదల సమయంలో, రాజకీయ వాతావరణం అనుకూలించలేదు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు చూడాల్సి వచ్చింది. చేసేది లేక.. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. అప్పటికే పవన్ జనసేన పార్టీ స్థాపించి.. 2019 ఎన్నికలకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఆ ఎన్నికల్లో విజయాన్ని సాధించలేకపోయారు పవన్. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది.
పవన్ సినిమాల పరిస్థితేంటి?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపి డిప్యూటీ సీఎంగా విధులు నిర్వస్తిస్తున్నారు. దీంతో సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. కానీ రాజకీయంగా బిజీగా ఉండడంతో.. రోజు రోజుకి ఈ సినిమాలు డిలే అవుతూ వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు పవర్ స్టార్. మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఓజి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే.. హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌ను కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.