Chiru Odela: ఒకప్పుడు సీనియర్ హీరోలంటే కేవలం సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేయాలి. సీనియర్ దర్శకులు అయితేనే వారిని హ్యాండిల్ చేయగలరు.. ఇలా ఎన్నో అపోహలు ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో ఆ అభిప్రాయాలు అన్నీ మారిపోయారు. సీనియర్ దర్శకుల వల్లే సీనియర్ హీరోలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అందుకే అలాంటి హీరోలు సైతం యంగ్ టాలెంట్ కోసం వెతుకుతున్నారు. అలా ఇప్పటికి యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన హీరోలు చాలావరకు సక్సెస్‌నే అందుకున్నారు. అదే విధంగా ఒకే సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెలకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు చిరు. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర అప్డేట్‌ను షేర్ చేసుకున్నారు నిర్మాత.
మాస్ డైరెక్టర్‌తో
నాని (Nani) హీరోగా నటించిన ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). ఎప్పుడూ నేచురల్ స్టార్‌గా, పక్కింటి కుర్రాడిగా కనిపించే నానిలో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు. దీంతో శ్రీకాంత్ ఓదెలకు మాస్ డైరెక్టర్‌గా ముద్రపడిపోయింది. నానికి ఎవరైనా దర్శకుడు నచ్చితే తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించడు. అందుకే శ్రీకాంత్ ఓదెలతోనే మరొక మూవీ ప్లాన్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే చిరంజీవితో పనిచేసే ఛాన్స్ దొరికిందని సంతోషంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు శ్రీకాంత్ ఓదెల.
Also Read: ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ రివ్యూ
పీరియాడిక్ సినిమా
దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు ఉంది ఒక సినిమా అనుభవమే అయినా తన విజన్‌ను నమ్మి ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి (Chiranjeevi). ఇది చాలా వైలెంట్ సినిమా అని ఓదెల ఇప్పటికే ప్రకటించాడు. చిరు మాత్రమే కాదు.. నాని కూడా ఈ దర్శకుడిని బాగా నమ్ముతున్నాడు. అందుకే ఈ సినిమాను తానే నిర్మించడానికి ముందుకొచ్చాడు. నానితో పాటు ఎస్‌ఎల్‌వీ సినిమాస్ కూడా చిరు, ఓదెల ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎస్ఎల్‌వీ సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కే ఈ చిత్రం ఒక పీరియాడిక్ డ్రామా అని బయటపెట్టారు.
అవన్నీ రూమర్స్
‘‘మెగా 156 (Mega 156) మాత్రమే కాదు.. ది ప్యారడైజ్ కూడా పీరియాడిక్ సినిమానే’’ అని సుధాకర్ చెరుకూరి తెలిపారు. అంతే కాకుండా మెగా 156లో అసలు హీరోయినే ఉండదని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై కూడా సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. ‘‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. మేము సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాం. ప్రస్తుతం స్టోరీ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది’’ అని స్పష్టం చేశారు. నానితో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పూర్తవ్వగానే చిరు మూవీపై ఫోకస్ చేస్తాడు ఓదెల. అప్పటివరకు చిరంజీవి కూడా తన ప్రస్తుత కమిట్మెంట్స్‌ను పూర్తిచేసి సిద్ధంగా ఉంటారు.