Tummala – MLA Adinarayana: అక్కడ అధికార పార్టీలో హద్దు మీరిన వర్గపోరుతో ఇద్దరు మంత్రుల మధ్య ఆ ఎమ్మెల్యే నలిగిపోతున్నారంట. కరవమంటే కప్పకు కోపం , విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైదంట ఆ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే పరిస్థితి. ఏ మంత్రి వర్గీయుడిగా ముద్ర వేయించుకోకుండా, నియోజకవర్గంలో తనదైన మార్క్ వేసుకోవడానికి ఆ శాసనసభ్యుడు ప్రయాస పడుతుంటే.. పార్టీ వర్గాల నుంచే సహకారం లభించడం లేదంట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఒంటరి పోరాటం చేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అశ్వారావుపేట. అక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జారే ఆదినారాయణకు సొంత సెగ్మెంట్లోనే పార్టీ పరంగా సినిమా కష్టాలు ఎదురవుతున్నాయంట. అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది అక్కడ పార్టీ నాయకుల వ్యవహారాం .. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్నప్పటికీ కిందిస్థాయి నాయకుల మధ్య సఖ్యత లేక ఇంట బయట చులకనైపోతున్నారు.
ఆ క్రమంలో కరవమంటే కప్పకు కోపం , విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిస్థితి.. ఎప్పుడు ఏ విషయంలో ఎవరు..? ఎందుకు అలుగుతారో తెలియని అయోమయంలో ఎమ్మెల్యే ఉంటున్నారంట. నియోజకవర్గంలోని అయిదు మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏకంగా 12గ్రూపులు ఉన్నాయి. దాంతో ఎవరికి ఏం చెప్పాలో? అందర్నీ ఎలా సమన్వయపర్చుకోవాలో ఎమ్మెల్యేకి అర్ధం కావటం లేదంట.
ఉన్న నామినేటెడ్ పదవుల కంటే ఆశావహులైన నాయకులు ఎక్కువ అవటం కూడా ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ఇటీవల ఆ తలనొప్పి మరింత పెరిగిందంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు.. స్థానిక ఎమ్మెల్యేపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గ ముద్ర ఉండటంతో దానిని కాపాడుకుంటూనే తనకు గుర్తింపు వచ్చేలా పర్యటనలు చేస్తూ ప్రజలకు ఎమ్మెల్యే చెరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే తన మార్కు పాలన అందించటానికి చెమటోడుస్తున్నా కిందిస్థాయి నాయకుల తీరుతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. వారి ప్రవర్తన తీరు ఎమ్మెల్యేకు పాలనలో, పనుల్లో పురోగతికి కూడా కొంత ఆటంకంగా మారిందట.
ఎమ్మెల్యేగా తీసుకునే నిర్ణయాల్లో కూడా కొందరు నాయకులు తలదుర్చుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. తాము చెప్తే ఎమ్మెల్యే చెప్పినట్లే అన్నట్లు కొందరు వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారంట. ముఖ్యంగా నియోజకవర్గంలోని అశ్వారావుపేట , దమ్మపేట , ములకలపల్లి మండలాలో ఆ పరిస్థితి ఎక్కువగా ఉందంట. ఎమ్మెల్యేగా జారే ఆదినారాయణ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన ఇస్తున్న హామీలు.. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి నచ్చటం లేదంట.
Also Read: రేపో మాపో కొత్త అధ్యక్షుడి ప్రకటన.. రేసులో మరో ఇద్దరు, ఈసారి పొలిటికల్ కోణంలో
మంత్రుల వర్గాల ఆధిపత్య పోరుతో స్వయానా ఎమ్మెల్యే అనుచరులు తమకు ఏ పనులు జరగటం లేదని.. ఒకరో ఇద్దరో చేతుల్లోనే ఎమ్మెల్యే ఉంటున్నారని.. దాంతో ఇంతకాలం నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఏ మండలంలో ఎమ్మెల్యే అడుగుపెట్టలన్నా ముందు పొంగులేటి వర్గీయులకు సమాచారం ఇవ్వలంట. మండలంలో ఏ పని చేయాలన్నా, ఎమ్మెల్యేను ఎవరు కలవాలన్నా ముందు పొంగులేటి అనుచరులను కలిసి.. పర్మిషన్ తీసుకుని ఎమ్మెల్యే ను కలవాలని కండీషన్ పెడుతున్నారంట. అలా జరగని పక్షంలో ఎమ్మెల్యే పర్యటనలో మరోసారి వారిని కనిపించనీయరంట.
ఇలా పొంగులేటి వర్గంతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేకు, మరో మంత్రి తుమ్మల వర్గం వ్యవహార తీరు మరింత తలనొప్పిగా మారిందట. తుమ్మల వర్గానికి ఎమ్మెల్యే మొదటి నుండి సహకరించక పోతుండటంతో పొంగులేటి వర్గం మాత్రం ఎమ్మెల్యే విషయంలో సంతోషంగా ఉందంట.. అదే తుమ్మల వర్గం ఆగ్రహానికి కారణమవుతుందంట. గత రెండు మూడు నెలలుగా అది మరింత తీవ్రంగా మారిందట. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వర్గీయులకు అసలు పొసగటం లేదంటున్నారు.
రాష్ట్ర క్యాబినెట్ లోనే సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల మాటను ఆయన సొంత గ్రామంలోనే ఎమ్మెల్యే అమలు చేయనీయడం లేదంట. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల భర్తీ చేసిన దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవిని చూపెడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల వర్గం నేతకే ఆయన స్వగ్రామం ఉన్న దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవి వస్తుందని అంతా భావించారు.. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం తుమ్మల అనుచరులను కాదని తన మార్క్ చూపించారు. తుమ్మల అనుచరులకు ఝలక్ ఇస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నామినేట్ పదవి ప్రకటించారు. అలా తుమ్మల వర్గానికి ఎమ్మెల్యేకు మొదటసారి చెడిందంట.
నియోజకవర్గంలో ఎప్పుడు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్నా ఇతర పనుల కారణాలు చెప్పి తుమ్మల వర్గం వాటికి దూరంగా ఉంటూ వస్తుంది. వారిప్పుడు ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టడం ఆదినారాయణకు మరింత తలనొప్పిగా మారిందంట. తుమ్మల సొంత మండలంలో మరో మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్న నేపధ్యంలో తుమ్మలకు స్థానిక ఎమ్మెల్యే కనీస సమాచారం ఇవ్వలేదని తుమ్మల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటన ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు తుమ్మల వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వివాదాన్ని మరింత ముదిరేలా చేశారు. పొంగులేటి పర్యటనను బహిష్కరించాలని తమ వర్గీయులందరికీ ఫోన్లు కూడా చేశారంట. ఇలా ఇద్దరు మంత్రుల అనుచరులు మధ్యలో ఎమ్మెల్యే నలిగిపోతున్నారంట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటో అని కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు తలలు పట్టుకుంటున్నారంట.