Manmohan Singh Funeral | దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం డిసెంబర్ 28, 2024న జరుగనున్నాయి. అంతక్రియలు, ఆయన అంతిమ యాత్రకు భారీ జన సందోహం ఉండే అవకాశముంది. ఈ కారణంగా ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందుగానే కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరక ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఒక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
“మాజీ ప్రధాన మంత్రి దివంగత శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం విదేశీ విఐపీలు, వివిఐపీలు, సామాన్య జనం ఢిల్లీలోని నిఘం బోధ్ ఘాట్ వద్దకు 28.12.2024న విచ్చేయనున్నారు. ఈ కారణంగా ప్రధాన మార్గాలైన రాజా రామ్ కోహ్లీ మార్గ్, రాజ్ ఘాట్ రెడ్ లైట్, సిగ్నేచర్ బ్రిడ్జ్, యుధిష్ఠిర్ సేతు లలో ట్రాఫిక్ డైవర్షన్ (దారి మళ్లింపు) పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది” అని శుక్రవారం రాత్రి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఢిల్లీలోని రింగ్ రోడ్ (మహాత్మ గాంధీ మార్గ్), నిషాద్ రాజ్ మార్గ్, బోలెవార్డ్ రోడ్, ఎస్‌పిఎం మార్గ్, లోథియాన్ రోడ్, నేతాజీ సుభాష్ మార్గ్ లలో ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
Also Read: మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మోడీ, షా.. అంతక్రియలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి
ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన అడ్వైజరీలో ప్రకటించిన మార్గాలలో సూచించిన సమయంలో ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని.. వీటితో పాటు అంతిమ యాత్ర మార్గంలో కూడా ప్రజల ప్రయాణం చేయకూడదని ఆంక్షలు విధించారు.
ఓల్డ్ ఢిల్లీ రైల్వ స్టేషన్, రెడ్ ఫోర్ట్, ఐఎస్‌బిటి, చాందిని చౌక్, తీస్ హజారీ కోర్టు వైపు వెళ్లేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. వీలైనంత ఈ మార్గాలలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారానే ప్రయాణించాలని.. ప్రైవేట్ వాహనాలు కేటాయించిన పార్కింగ్ లాట్స్ లలో మాత్రమే పార్క్ చేయాలి.. రోడ్డు పక్కన పార్కింగ్ చేయరాదని హెచ్చరించారు. ఏదైనా అనుమాస్పద వ్యక్తి, లేదా వాహనం కనిపిస్తే.. పోలీసులు వెంటనే సమాచారం అందించాలని కోరారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ వద్ద జరుగనున్నాయి. అంత్యక్రియల కార్యక్రమం శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమవుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) డిసెంబర్ 26, 2024 రాత్రి 9.51 గంటలకు ఊపిరి సమస్యలతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశానికి అపూర్వ సేవలందించారు. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 2004 నుంచి 2014 పదేళ్ల పాటు దేశ ప్రధాన మంత్రి పదవిని రెండు సార్లు చేపట్టారు.