Peddi First Shot : రామ్ చరణ్ తేజ్ ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితమైన, ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. చిరుత సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. వాస్తవానికి ఈ సినిమా ఈ రోజుల్లో వచ్చుంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. మగధీర సినిమా తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ సినిమాతో తనలో మంచి మేకవర్ చూపించాడు చరణ్.
రంగస్థలంతో మరో యాంగిల్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రకు ప్రాణం పోసాడు చరణ్. ఇది కదా మెగాస్టార్ తనయుడి టాలెంట్ అంటే అని చాలా మందితో అనిపించాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చినా కూడా, రామ్ చరణ్ చేసిన రంగస్థలం క్యారెక్టర్ చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి. రామ్ చరణ్ లాంటి మాస్ కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోని సుకుమార్ అలా చూపించి సక్సెస్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్. ఇకపోతే అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు బుచ్చిబాబు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ది సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 1:05 సెకండ్ల నిడివి ఉన్న ఈ షాట్ సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేసింది.
బుచ్చిబాబు అరాచకం
బుచ్చిబాబు టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఉప్పెన సినిమాతోనే తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ లో చూపించబోతున్నాడు. రామ్ చరణ్ మాత్రం పెద్ది క్యారెక్టర్ లో దుమ్ము లేపాడు. ఇంకా ఈ టీజర్ లో గమనిస్తే ఫస్ట్ షార్ట్ లోనే రామ్ చరణ్ సిక్సర్ కొట్టారు. క్రికెట్ గ్రౌండ్ లోకి గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. ఆఖర్లో హీరోయిజం ఫిలాసఫీ టచ్ వచ్చే డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర యాస అదిరిపోయింది. ఒక ప్రాంతీయ సినిమా చేస్తున్నప్పుడు ముఖ్యంగా అందరూ గమనించేది యాసను మాత్రమే. ఈ విషయంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.మొత్తానికి ఇదంతా చూస్తుంటే రంగస్థలం సినిమాలోని డైలాగులా ఇదయ్యా మీ అసలు రూపం అనిపిస్తుంది.