Ram Gopal Varma Case : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan),మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు వర్మ. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలలో కేసులు నమోదు అవ్వగా నవంబర్ 17వ తేదీన విచారణకు రావాలి అని, ఒంగోలు నుంచి ఒంగోలు పోలీసులు హైదరాబాదులో ఉంటున్న వర్మ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందించారు.
డుమ్మా కొట్టిన వర్మ..
అయితే విచారణకు హాజరుకాలేనని, వారం రోజులు గడువు కావాలని, తన లాయర్ తో చెప్పించారు రాంగోపాల్ వర్మ. గడువును 24వ తేదీకి వాయిదా వేస్తూ నవంబర్ 24న విచారణకు హాజరుకావాలని, ఒంగోలు పోలీసులు తెలిపారు. ఇక నిన్న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. నిన్న కూడా ఆయన తప్పించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టు చేయాలనుకున్నారు.. అందులో భాగంగానే ఆయన కోసం గాలించగా ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ముందస్తు బెయిల్ కోరిన వర్మ..
ఇకపోతే తనపై వేసిన కేసుల కారణంగా ముందస్తు బెయిల్ కోరారు రాంగోపాల్ వర్మ. ఈ నేపథ్యంలోనే వర్మ ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలలో తన పైన నమోదైన కేసుల్లో భాగంగా ముందస్తు బెయిల్ కోరుతూ పిటీషన్ వేశారు రాంగోపాల్ వర్మ తరఫు న్యాయవాది. ఇక ఈరోజు విచారణకు రానున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇక వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అనే విషయం ఇంకొన్ని గంటలు ఎదురు చూస్తే తప్ప తెలియదు.
పరారీలో వర్మ..
ఇకపోతే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక రాంగోపాల్ వర్మ కోసం హైదరాబాదు తో పాటు తమిళనాడు వంటి ప్రాంతాలలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాంగోపాల్ వర్మ చిత్రాలు..
రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే.. డేరింగ్ అండ్ డాషింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వెనుక ఆలోచించకుండా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం ఈయనది. అలాంటి ఈయన ఇప్పుడు కేసుల్లో ఇరుక్కోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వర్మ నిజంగానే పరారీలో ఉన్నారా? లేక ఏదైనా పని మీద బయటకు వెళ్లారా? అనే విషయం తెలియాల్సి ఉంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక వర్మ గురించి చెప్పాలంటే ‘శివ’, ‘దెయ్యం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు వర్మ. ఇకపోతే ఈమధ్య అన్ని అడల్ట్ సినిమాలు చేస్తూ విమర్శలు తెచ్చుకుంటున్నారు. కానీ ఒకప్పుడు డైరెక్షన్ రంగంలోకి అడుగు పెట్టారంటే, ఆయన టేకింగ్ కి ఎలాంటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఇక త్వరలోనే అలాంటి ఒక సినిమాతో మళ్ళీ వస్తానని చెప్పారు వర్మ. మరి వర్మ నుంచి వచ్చే అత్యంత పవర్ఫుల్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అంటూ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.