Double ISMART Trailer: ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొన్నేళ్లుగా విజయం కోసం పరితపిస్తున్న విషయం తెల్సిందే. ఇంకోపక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా లైగర్ లాంటి డిజాస్టర్ నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి తమకు అచ్చొచ్చిన సినిమాకు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే డబుల్ ఇస్మార్ట్. వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ కు పర్ఫెక్ట్ సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను డిజైన్ చేసినట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. ఇక సినిమా మొత్తాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే.. మొదటి పార్ట్ లో ఒక పోలీస్ అధికారి మెమరీని శంకర్ బ్రెయిన్ లో ఇన్సర్ట్ చేసి.. పోలీసులు వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను తెలుసుకుంటారు.
ఇక ఈ సీక్వెల్ లో ఒక గ్యాంగ్ స్టార్ మెమరీని మరోసారి శంకర్ బ్రెయిన్ లో ఇన్సర్ట్ చేసి.. ఆ గ్యాంగ్ స్టార్ కు డబుల్ గా తయారుచేస్తారు. అసలు ఎందుకు ఆ బిగ్ బుల్ తన మెమరీని.. శంకర్ బ్రెయిన్ లో ఇన్సర్ట్ చేశాడు. శంకర్ పాత జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయా.. ? తన గర్ల్ ఫ్రెండ్ ను చంపిన విలన్ పై పగ తీర్చుకున్నాడా.. ? మధ్యలో వచ్చిన కావ్య థాపర్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక ఇస్మార్ట్ శంకర్ గా రామ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిస్తే.. బిగ్ బుల్ గా సంజయ్ దత్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్ లో రామ్.. మరోసారి ఇస్మార్ట్ శంకర్ ను గుర్తుచేశాడు. ఇక మణిశర్మ మ్యూజిక్ పవర్ ప్యాక్డ్ గా కనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇక పూరి డైలాగ్స్, ఆలీ కామెడీ, రొమాన్స్.. అన్ని ట్రైలర్ లో చూపించేశారు. మరి ఈ సినిమా ఈ కాంబోకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.