Ranveer Singh: హీరోలుగా, హీరోయిన్లుగా ఎంటర్ అయ్యి కాస్త సక్సెస్ సాధించిన తర్వాత ఆఫ్ స్క్రీన్ విభాగాల్లో కూడా తమ సత్తా చాటుకోవాలని అనుకుంటూ ఉంటారు సినీ సెలబ్రిటీలు. కానీ అందులో కొందరు మాత్రమే అడుగుపెట్టిన ప్రతీ ఫీల్డ్‌లో సక్సెస్ అయ్యింటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు నిర్మాణ రంగంలో అడుగుపెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా అదే పనిచేయనున్నట్టు బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రణవీర్‌కు సరైన హిట్ లేదు, చేతిలో ఆఫర్లు కూడా పెద్దగా లేవు. ఇలాంటి సమయంలో రణవీర్ చేస్తుంది చాలా పెద్ద రిస్క్ అని ఫ్యాన్స్ వాపోతున్నారు.
రణవీర్ నిర్ణయం
రణవీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనె (Deepika Padukone) ప్రేమించి పెళ్లి చేసుకొని బాలీవుడ్‌లోనే క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే దీపికా.. తనకంటే సక్సెస్‌ఫుల్ అని రణవీర్ గురించి చాలామంది ప్రేక్షకులు నెగిటివ్‌గా మాట్లాడేవారు. తన భార్యతో సమానంగా సినిమాలు చేయాలని సక్సెస్ సాధించాలని రణవీర్ ప్రయత్నించినా అది కుదరలేదు. కొంతకాలానికే రణవీర్‌ను బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వెంటాడాయి. దీంతో తన కెరీర్‌లో భారీగా గ్యాప్ వచ్చేసింది. అదే సమయంలో దీపికా.. అటు ప్రొఫెషనల్, ఇటు బిజినెస్.. రెండిటిలో సక్సెస్ సాధించింది. అదంతా దృష్టిలో పెట్టుకొని రణవీర్ సింగ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అతడి సాయంతో
చాలామంది ఇతర బాలీవుడ్ స్టార్ హీరోలలాగానే రణవీర్ సింగ్ కూడా ఒక ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే తన ప్రొడక్షన్ కంపెనీ పేరును రెజిస్టర్ చేయించుకున్నాడని, దానికోసం ఆఫీస్ సెటప్ కూడా ప్రారంభించాడని తెలుస్తోంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ ‘ధురంధర్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను యామీ గౌతమ్ భర్త ఆదిత్య ధర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదిత్య ధర్‌కు సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది. అందుకే రణవీర్ సింగ్ ప్రొడక్షన్ హౌస్ సెటప్ కోసం ఆదిత్య సాయం కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మొత్తానికి హీరోగా సక్సెస్‌లు లేకపోవడంతోనే రణవీర్ ఈ నిర్ణయానికి వచ్చాడా అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆశ్చర్యపరుస్తున్న విక్కీ కౌశల్ ట్రైనింగ్.. నిజంగా గ్రేట్ గురూ..!
అదే స్ట్రాటజీ
నిర్మాతగా తన మొదటి సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక మైథలాజికల్ కథను రెడీగా పెట్టుకున్నాడట రణవీర్ సింగ్. ఆదిత్య ధర్ ఎంతోకాలంగా ‘ది ఇమ్మార్టల్ అశ్వద్ధామ’ అనే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్‌కు ప్రొడక్షన్ బాధ్యతలను తాను స్వీకరించాలని, ఒక భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీతో నిర్మాతగా డెబ్యూ చేయాలని రణవీర్ భావిస్తున్నాడట. నిర్మాతగా మారితే తను నటించే సినిమాల విషయంలో తనకు మరింత ఎక్కువగా పట్టు ఉంటుందని, దాని వల్లే తను ఈ నిర్ణయానికి వచ్చాడని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. రణవీర్ చివరిగా ‘సింగం అగైన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.