Rashmika Mandanna.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) మరొకసారి వివాదంలో చిక్కుకుంది. తన మాతృభాష గురించి గతంలో చేసిన కామెంట్లకు కన్నడిగుల ఆగ్రహానికి గురైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరొకసారి లాంగ్వేజ్ పై మాట్లాడి విమర్శలు ఎదుర్కొంటుంది. అసలు ఏం జరిగింది? రష్మికపై మళ్ళీ విమర్శలు రావడానికి కారణం ఏంటి ? అంతలా ఆమె ఏం చేసింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
కుబేర ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక..
అసలు విషయంలోకెళితే.. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద వేలకోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ.. బిజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక తాజాగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ధనుష్ (Dhanush), నాగార్జున(Nagarjuna) రష్మిక మందన్న కలయికలో వస్తున్న ఈ సినిమాకి శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు విజయ్ (Vijay Thalapathi) ‘వారసుడు’ సినిమాతో చెన్నై ఆడియన్స్ను పలకరించిన ఈమె ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మళ్లీ చెన్నైలో దర్శనమిచ్చింది రష్మిక. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే రష్మిక పంచుకున్న ఫోటోలలో.. నాగార్జున పాదాల దగ్గర కూర్చొని ఏదో చర్చిస్తోంది. అటు నాగార్జున కూడా రష్మిక చేయి పట్టుకొని ఆమెతో మాట్లాడుతూ కనిపించారు. చెన్నైలో జరిగిన కుబేర గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫోటో ఆమె షేర్ చేసుకుంది. అంతేకాదు ఒక ప్రత్యేకమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.
మళ్లీ వివాదంలో చిక్కుకున్న రష్మిక..
రష్మిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో..” చెన్నైలో కుబేర సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాము. ఒకరకంగా చెప్పాలి అంటే నా బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది. కాబట్టి నా హృదయంలో చెన్నైకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాను. కుబేర ప్రమోషన్ ఈవెంట్ చాలా అద్భుతంగా సాగింది. మా నాన్న ఇక్కడే పనిచేయడం వల్ల మేము చెన్నైలోనే నివసించాము. ఇక్కడ నేను రస్కిన్ అనే స్కూల్లో చదువుకున్నాను. అయితే ఇప్పుడు ఆ స్కూల్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత మేము కూర్గ్ కి మారాము. నేను నేర్చుకున్న మొదటి భాషా తమిళ్” అంటూ రష్మిక తన పోస్టు కింద క్యాప్షన్ గా రాసుకుంది.
రష్మిక పై ఫైర్ అవుతున్న కన్నడిగులు..
దీంతో తమిళ్ భాష పై చెన్నై పై ప్రశంసలు కురిపించడంతో కన్నడిగులు రష్మికపై మండిపడుతున్నారు. ఎక్కడ ఉంటే ఆ భాష పై ప్రేమ కురిపిస్తూ ఊసరవెల్లిలా మాటలు మారుస్తోంది అంటూ రష్మికపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అయితే ఛావా ప్రమోషన్స్లో హైదరాబాదు గురించి మాట్లాడి కన్నడిగుల ఆగ్రహానికి గురైన ఈమె.. ఇప్పుడు మళ్లీ చెన్నైలో మొదటి నేర్చుకున్న భాషా తమిళ్ అని చెప్పి మరొకసారి చిక్కుల్లో పడింది. మరి దీనిపై ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.