Rashmika Mandanna: వరుసగా సౌత్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందనా. అలాంటిది ఇటీవల బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. గత కొన్నాళ్లుగా రష్మిక పట్టిందల్లా బంగారమే అయిపోయింది. అందుకే తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా తను హీరోయిన్‌గా నటించిన భారీ బడ్జెట్ బాలీవుడ్ మూవీ ‘ఛావా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం రష్మిక చాలా కష్టపడుతోంది. అందులో భాగంగా తను పాల్గొన్న ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ.
నెగిటివిటీ వచ్చింది
లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛావా’ (Chhaava)లో ఛత్రపతి సాంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటించగా.. తన భార్య మహారాణి యేసుబాయ్ పాత్రలో రష్మిక మందనా (Rashmika Mandanna) కనిపించింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి చిన్న గ్లింప్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘‘నేను నా పాత్రకు చాలా శ్రద్ధతో చేశాను. నేను ఈ సినిమాలో పనిచేస్తున్నాను అని తెలియగానే చాలా నెగిటివిటీ వచ్చింది. ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి మరాఠీ మహారాణి పాత్రలో ఎలా కనిపిస్తుంది అని అందరూ అన్నారు. నా పర్ఫార్మెన్స్‌తోనే వారందరూ తప్పు అని ప్రూవ్ చేయాలని అనుకున్నాను. అందుకే పాత్ర కోసం ప్రాణం పెట్టాను’’ అంటూ తన కష్టం గురించి చెప్పుకొచ్చింది రష్మిక.
అదే ప్రేమంటే
‘‘ట్యాగ్స్ అనేవి కెరీర్‌కు సాయం చేస్తాయని నేను అనుకోను. అవి ఫ్యాన్స్ ప్రేమతో పెట్టుకునే పేర్లు మాత్రమే. వాళ్లకి మనల్ని ఎలా పిలవాలని అనిపిస్తే అలా పిలుస్తారు. అవి కేవలం ట్యాగ్స్ మాత్రమే. మన సినిమా చూడడానికి ప్రతీ శుక్రవారం ప్రేక్షకులు టికెట్లు కొని థియేటర్లకు రావడమే నా దృష్టిలో ప్రేమంటే. నేను ఒక్క సినిమాతోనే బయటికి వెళ్లిపోతానని అనుకున్నాను. కానీ ఇప్పటికీ 24 సినిమాలు అయ్యాయి. నాకంటే అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా ఈ ప్రయాణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను నా ఆడియన్స్‌తో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాను. నేను ఇప్పుడు చేస్తుందే ఎప్పటికీ చేయాలని అనుకుంటున్నాను’’ అంటూ మరోసారి ఫ్యాన్స్‌పై ప్రేమను బయటపెట్టింది రష్మిక.
Also Read: టైటిల్ మార్చలేదని చిరంజీవి సినిమా నుండి తప్పుకున్న శ్రీదేవి.. ఇంతకీ ఏ మూవీ అంటే.?
రెండూ ముఖ్యమే
‘‘ఒకేసారి ఒక సౌత్ సినిమా ఈవెంట్‌లో, హిందీ మూవీ ఈవెంట్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే ఎంచుకోవడం నాకు చాలా కష్టం. కానీ ప్రతీ ఇండస్ట్రీ నుండి నాకు ఎంత ప్రేమ దొరికిందో నాకు తెలుసు. కాబట్టి నేను నిద్ర లేకుండా అయినా ప్రతీ ఈవెంట్‌లో పాల్గొనడానికి ట్రై చేస్తాను. నాకు మనుషులంటే చాలా ఇష్టం. వారి ప్రేమే నాకు అన్నింటి కంటే ముఖ్యం. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. దానివల్లే ఒకేసారి రెండు, మూడు సినిమాలు షూట్ చేయాల్సి వచ్చినా పర్వాలేదు అనుకుంటాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. డబుల్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా చేస్తాను. సినిమా విడుదలయ్యి ప్రేక్షకులు ఆదరిస్తే అదే నాకు హై ఇస్తుంది’’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందనా.